MI vs CSK: ముంబయిపై చెన్నై ప్రతీకారం తీర్చుకోనుందా?

ఐపీఎల్‌లో విజయవంతమైన జట్లలో ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ముందుంటాయి. ఈ రెండు జట్లూ తలపడే మ్యాచ్‌లకు మంచి ఆదరణ ఉంటుంది...

Updated : 18 Sep 2021 17:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌లో విజయవంతమైన జట్లలో ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ముందుంటాయి. ఈ రెండు జట్లూ తలపడే మ్యాచ్‌లకు మంచి ఆదరణ ఉంటుంది. కాగా, ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు మొత్తం 14 సీజన్లలో 32 మ్యాచ్‌లు జరగ్గా ముంబయి 19, చెన్నై 13 విజయాలు సాధించాయి. అయితే, ఐపీఎల్‌ 14వ సీజన్‌లోని మిగతా మ్యాచ్‌లు ఆదివారం నుంచి తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో నిర్వాహకులు ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌తోనే టోర్నీని తిరిగి కొనసాగిస్తున్నారు.

కరోనా వైరస్‌కు ముందు ఈ సీజన్‌ తొలి భాగంలో ముంబయి, చెన్నై జట్ల మధ్య ఎప్పటిలాగే ఓ హోరాహోరీ మ్యాచ్‌ జరిగింది. ఈ సందర్భంగా ధోనీసేన నిర్దేశించిన 219 పరుగుల భారీ లక్ష్యాన్ని రోహిత్‌ టీమ్‌ ఛేదించింది. కీరన్‌ పొలార్డ్‌ దంచికొట్టడంతో ముంబయి ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ జరిగిన మూడు రోజులకే పలువురు ఆటగాళ్లు వైరస్‌ బారిన పడటంతో టోర్నీని నిరవధిక వాయిదా వేశారు. తిరిగి ఇప్పుడు యూఏఈలో నిర్వహిస్తున్న నేపథ్యంలో చెన్నై ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో కనిపిస్తోంది.

ఇప్పటికే ఈ లీగ్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్న ధోనీసేన ఆదివారం ప్రారంభమయ్యే ముంబయి మ్యాచ్‌తోనే మరోసారి విజయపరంపరం కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు టోర్నీ నిలిచిపోయేసరికి నాలుగో స్థానంలో నిలిచిన ముంబయి ఇండియన్స్‌ ప్లేఆఫ్స్‌ చేరాలంటే ప్రతి మ్యాచ్‌ కీలకమే. రెండో భాగంలో మిగిలిన జట్లు గట్టి పోటీ ఇచ్చే వీలుండటంతో ముంబయి జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. దీంతో తొలి మ్యాచ్‌లోనే మరోసారి చెన్నైను ఓడించాలనే పట్టుదలతో ఉంది.

ఇంతకుముందు ఏం జరిగింది..

తొలి భాగంలో 27వ మ్యాచ్‌లో తలపడిన రెండు జట్లు అభిమానులకు పసందైన వినోదం అందించాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 218 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(4), సురేశ్‌  రైనా (2) విఫలమైనా.. డుప్లెసిస్‌(50; 28 బంతుల్లో 2x4, 4x6), మొయిన్‌ అలీ (58; 36 బంతుల్లో 5 x4, 5x6) రాణించారు. వీరిద్దరూ అర్ధశతకాలతో మెరవడంతో పాటు చివర్లో అంబటిరాయుడు (72; 27 బంతుల్లో 4x4, 7x6) మెరుపు బ్యాటింగ్‌ చేశాడు. రవీంద్ర జడేజా (22; 22 బంతుల్లో 2x2) సైతం వీలైనన్ని పరుగులు చేయడంతో చెన్నై భారీ స్కోర్‌ సాధించింది.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ముంబయి ఇండియన్స్‌ ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు రోహిత్‌ (35; 24 బంతుల్లో 4x4, 1x6), క్వింటన్‌ డికాక్‌(38; 28 బంతుల్లో 4x4, 1x6) శుభారంభం చేయగా తర్వాత వచ్చిన సూర్యకుమార్‌ కుమార్‌(4) విఫలమయ్యాడు. ఆపై కృనాల్‌ పాండ్య(32; 23 బంతుల్లో 2x4, 2x6), కీరన్‌ పొలార్డ్‌ (87 నాటౌట్‌; 34 బంతుల్లో 6x4, 8x6) ధాటిగా ఆడి కీలక పరుగులు చేశారు. మధ్యలో కృనాల్‌ ఔటైనా పొలార్డ్‌ చివరి వరకూ క్రీజులో నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో ముంబయి ఐపీఎల్‌లో భారీ లక్ష్య ఛేదన చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని