Farokh on Virat: కోహ్లీ మనలాంటోడే.. మనమంతా తప్పులు చేస్తుంటాం: ఫరూక్ ఇంజినీర్‌

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ కొంత కాలంగా శతకం సాధించకపోవడంపై మాజీ క్రికెటర్‌ ఫరూక్‌ ఇంజినీర్‌ స్పందించాడు. కోహ్లీ కూడా మనలాంటి మనిషే అని, మానవులు ఎవరైనా తప్పులు చేస్తారని చెప్పాడు...

Updated : 23 Aug 2021 15:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ కొంత కాలంగా శతకం సాధించకపోవడంపై మాజీ క్రికెటర్‌ ఫరూక్‌ ఇంజినీర్‌ స్పందించాడు. కోహ్లీ కూడా మనలాంటి మనిషే అని, మానవులు ఎవరైనా తప్పులు చేస్తారని చెప్పాడు. టీమ్‌ఇండియా సారథి సుమారు రెండేళ్లుగా ఒక్క శతకం సాధించలేకపోయినా.. మరోవైపు ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోరూట్‌ ఈ ఏడాది ఇప్పటివరకు ఐదు శతకాలు బాదాడు. ఈ నేపథ్యంలోనే వారిద్దరి బ్యాటింగ్‌పై స్పందించిన ఫరూక్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘కోహ్లీలాంటి సత్తా ఉన్న ఆటగాడు బరిలోకి దిగిన ప్రతిసారీ శతకం సాధించాలని మనమంతా కోరుకుంటాం. కానీ, విరాట్‌ కూడా మనలాంటి వ్యక్తే. మానవులు ఎవరైనా తప్పులు చేస్తారు. అలాగే అతడు శతకం సాధించకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో అదృష్టం కూడా కలిసి ఉంటుంది. కానీ, దురదృష్టం కొద్దీ కోహ్లీ తరచూ ఔటైపోతున్నాడు. బంతి అతడి బ్యాట్‌ అంచులకు తాకుతూ వికెట్‌ కోల్పోతున్నాడు. ఈ విషయంలో నేను కోహ్లీని నిందించను. ఎందుకంటే అతడింకా గొప్ప ఆటగాడే. ఇప్పటికీ 40-50 పరుగులు చేస్తున్నాడు. అతడో మేటి ఆటగాడు’ అని ఫరూక్‌ పేర్కొన్నాడు. మరోవైపు ఇంగ్లాండ్‌ సారథి గురించి మాట్లాడుతూ.. రూట్‌ ప్రస్తుతం ప్రపంచంలోని మేటి బ్యాట్స్‌మెన్‌లో ఒకడని కొనియాడాడు. జట్టుకు అవసరమైన రీతిలో అతడు నిలకడగా పరుగులు చేస్తున్నాడని చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని