IND vs NZ: కోహ్లీ తిరిగొచ్చినా సూర్య మూడులోనే ఆడాలి: గంభీర్

టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చినా సూర్యకుమార్‌ యాదవ్‌ మూడో స్థానంలోనే ఆడాలని మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు...

Updated : 18 Nov 2021 15:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చినా సూర్యకుమార్‌ యాదవ్‌ మూడో స్థానంలోనే ఆడాలని మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. బుధవారం రాత్రి న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 పోరులో సూర్యకుమార్‌ (62) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడిన గంభీర్‌ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సూర్య అన్ని వైపులా షాట్లు ఆడగలడని, స్పిన్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటాడని మాజీ ఓపెనర్‌ అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలోనే కోహ్లీ తిరిగొచ్చినా అతడినే మూడో స్థానంలో చూడాలనుకుంటున్నట్లు తన మనసులోని మాట వెలిబుచ్చాడు.

‘సూర్యను మూడో స్థానంలో ఆడించడం టీమ్‌ఇండియాకు కలిసివస్తోంది. ప్రస్తుత ఓపెనర్లు రోహిత్‌, రాహుల్‌ అద్భుతంగా ఆడుతున్నారు. వాళ్లిద్దరూ సాధిస్తున్న పరుగుల వేగాన్ని అతడు చక్కగా కొనసాగిస్తాడు. ఈ క్రమంలోనే విరాట్‌ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి. స్టీవ్‌స్మిత్‌ ఎలాగైతే ఆస్ట్రేలియా తరఫున నాలుగో స్థానంలో వస్తున్నాడో కోహ్లీ కూడా అటువంటి పాత్రే పోషించాలి. ఒకవేళ ఎప్పుడైనా జట్టు ఆదిలోనే పలు వికెట్లు కోల్పోతే అప్పుడు విరాట్‌ మిడిల్‌ ఆర్డర్‌ను ముందుకు నడిపించవచ్చు. మిడిల్ ఆర్డర్‌లో రిషభ్‌ పంత్‌ మినహా అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మన్‌ లేనందున కోహ్లీ అక్కడ ఆడితే సరిపోతుంది. కాబట్టి, అతడు నాలుగో స్థానంలో ఆడటం వల్ల జట్టులో కీలక పాత్ర పోషించడమే కాకుండా మిడిల్‌ ఆర్డర్‌ను బలోపేతం చేస్తాడు. అలాగే సూర్యకుమార్‌ ఎన్ని పరుగులు చేసినా చివరి వరకూ క్రీజులోనే ఉండి మ్యాచ్‌ గెలిపించడమే ముఖ్యం. ఈ విషయంలో నేను నిరాశ చెందా’ అని గంభీర్‌ తన అభిప్రాయాలను పంచుకొన్నాడు.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని