IND vs NZ: డివిలియర్స్‌ నా కెరీర్‌పై అత్యంత ప్రభావం చూపాడు

ప్రముఖ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ తన కెరీర్‌పై చాలా ప్రభావం చూపాడని టీమ్‌ఇండియా యువ పేసర్‌ హర్షల్‌ పటేల్‌ అన్నాడు. గతరాత్రి అతడు భారత్‌ తరఫున అరంగేట్రం చేసి తొలి మ్యాచ్‌లోనే...

Published : 20 Nov 2021 11:20 IST

ఇంతకుమించిన అరంగేట్రం ఆశించలేను: హర్షల్‌పటేల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ తన కెరీర్‌పై చాలా ప్రభావం చూపాడని టీమ్‌ఇండియా యువ పేసర్‌ హర్షల్‌ పటేల్‌ అన్నాడు. గతరాత్రి అతడు భారత్‌ తరఫున అరంగేట్రం చేసి తొలి మ్యాచ్‌లోనే మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ మ్యాచ్‌లో కివీస్‌ను 153/6కు టీమ్‌ఇండియా పరిమితం చేసింది. హర్షల్‌ రెండు వికెట్లు తీయడమే కాకుండా పొదుపుగా బౌలింగ్‌ చేసి కీలక పాత్ర పోషించాడు.

మ్యాచ్‌ అనంతరం హర్షల్‌ మాట్లాడుతూ.. ‘ఇంతకుమించిన మంచి అరంగేట్రం ఆశించలేను. అంతగా టాలెంట్‌ లేని నాలాంటి ఆటగాడు ఆటలో రాణించాలంటే ప్రతి చిన్న విషయం నుంచీ నేర్చుకోవాల్సి ఉంటుంది. మొదట్లో తప్పులు చేసి.. నేనేం చేయగలనో.. ఏం చేయలేనో లాంటి విషయాలు గుర్తించాను. దీంతో నెమ్మదిగా రాణించడం మొదలుపెట్టా. ఇక బౌలింగ్‌లో మరీ ఎక్కువ వైవిధ్యమైన బంతులు వేయాలని నేను అనుకోను. మనం ఎలాంటి బంతులేస్తామో వాటిపైనే దృష్టిపెట్టి మరింత మెరుగైతే చాలనుకుంటా. టీమ్‌ఇండియా తరఫున ఆడటం.. ఇక్కడ రాణించడం, నా నైపుణ్యాలు ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉంది’ అని వివరించాడు.

అనంతరం రాయల్‌ ఛాలెంజర్స్‌ మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌పై స్పందిస్తూ.. ‘అతడిని నేనెప్పుడూ చాలా దగ్గరి నుంచి గమనిస్తూ ఉండేవాడిని. ఐపీఎల్‌ 2021లో యూఏఈ లెగ్‌కు ముందు నేను బౌలింగ్‌లో ఎక్కువ పరుగులు ఇవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలని అడిగాను. ఒక ఓవర్‌లో 30 పరుగుల దాకా ఇచ్చాను. దీంతో అతడు స్పందిస్తూ.. నా బౌలింగ్‌లో ఎలాంటి మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదన్నాడు. మంచి బంతులు వేసినప్పుడు కూడా బ్యాట్స్‌మన్‌ షాట్లు ఆడితే వారిని మరిన్ని షాట్లు ఆడేలా రెచ్చగొట్టాలని చెప్పాడు. అలా నా బౌలింగ్‌కు విలువైన సూచనలు చేశాడు’ అని హర్షల్‌ గుర్తుచేసుకున్నాడు. కాగా, డివిలియర్స్‌ శుక్రవారం అన్ని ఫార్మాట్ల ఆట నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆడుతున్న లీగులకు కూడా గుడ్‌బై చెప్పాడు.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని