
Virat Kohli vs Anderson: కోహ్లీని ప్రశాంతంగా ఉంచడమే నా ఉద్దేశం: అండర్సన్
లీడ్స్: టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీని ప్రశాంతంగా ఉంచాల్సిన అవసరం ఉందని ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ అంటున్నాడు. ఆట పరంగా తామిద్దరి మధ్య వైరం ఉందని తెలిపాడు. వయసు పెరిగినా ఆటలో కొనసాగేందుకు నెట్స్‌లో తక్కువగా బంతులు వేస్తున్నట్లు వెల్లడించాడు.
‘లార్డ్స్ టెస్టు తర్వాత మేం డ్రస్సింగ్ రూమ్‌లో మాట్లాడుకున్నాం. మా బలాలపై దృష్టి సారించాలని అనుకున్నాం. బయటి చప్పుళ్లకు తెరవేయాలని నిర్ణయించుకున్నాం. నిజానికి లార్డ్స్‌లో మూడు రోజుల వరకు మేం బాగానే ఆడాం. ఆ తర్వాత జరిగిందే మాపై తీవ్ర ప్రభావం చూపించింది. ఏదేమైనా మనం మనుషులం. అందుకే మా బలాలపై దృష్టి పెట్టాం’ అని అండర్సన్ తెలిపాడు.
‘విరాట్ కోహ్లీ వికెట్ తీయడం నాకెంతో ప్రత్యేకం. కొన్నేళ్లుగా మా ఇద్దరి మధ్య ఆట పరంగా వైరం ఉంది. అతడిని ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంచాలి. లేదంటే అతడి విధ్వంసాలను ఆపలేం. నిజానికి ఈ సిరీస్‌లో అతడికి మేం చక్కగా బౌలింగ్ చేశాం. ఇకపై సాధ్యమైనంత మేరకు అతడిని ప్రశాంతంగానే ఉంచుతాం’ అని అండర్సన్ అన్నాడు. ప్రస్తుత మ్యాచును అతడు 2010లో ఆసీస్‌తో ఆడిన యాషెస్ మ్యాచుతో పోల్చాడు. తమ ఓపెనర్లు ఈ పోరులో అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారని వెల్లడించాడు.
వయసు పెరిగినా వికెట్లు తీయడం సంతోషకరంగా ఉందని జిమ్మీ అన్నాడు. తనను కుడి భుజం నొప్పి ఇంకా వేధిస్తోందని పేర్కొన్నాడు. ‘వయసు పెరుగుతుండటంతో జిమ్‌లో ఎక్కువ కసరత్తులు చేయాల్సి వస్తోంది. మ్యాచులో త్వరగా అలసిపోకుండా ఉండేందుకు నెట్స్‌లో తక్కువగా బౌలింగ్ చేస్తున్నా. ఎందుకంటే మ్యాచ్ మధ్యలో అవసరమైనప్పుడు బౌలింగ్ చేయడం కీలకం. సుదీర్ఘ ఫార్మాట్‌కు మానసికంగా సిద్ధమవ్వడమే అతిపెద్ద సవాల్. ఇప్పటికీ నా కుడిభుజం నొప్పి వేధిస్తోంది. కానీ, ఇవన్నీ ఆటలో భాగమే కదా’ అని అతడు పేర్కొన్నాడు.