Rupinder Pal Singh: అమ్మాయిల్లా ఆడాలనుకున్నాం.. పతకం అందంగా ఉంది!

ఒలింపిక్స్‌లో హాకీ అమ్మాయిల ఆటను చూసి ప్రేరణ పొందామని హాకీ క్రీడాకారుడు రూపిందర్‌పాల్‌ సింగ్‌ అన్నాడు. వరుసగా ఓటములు ఎదురైనా వారు సెమీస్‌కు చేరుకున్న తీరు అద్భుతమని ప్రశంసించాడు...

Published : 12 Aug 2021 01:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒలింపిక్స్‌లో హాకీ అమ్మాయిల ఆటను చూసి ప్రేరణ పొందామని హాకీ క్రీడాకారుడు రూపిందర్‌పాల్‌ సింగ్‌ అన్నాడు. వరుసగా ఓటములు ఎదురైనా వారు సెమీస్‌కు చేరుకున్న తీరు అద్భుతమని ప్రశంసించాడు. తమ జట్టు సమావేశాల్లో వారి గురించి మాట్లాడుకున్నామని వెల్లడించాడు. హాకీ దిగ్గజాల వారసత్వం నిలబెట్టినందుకు సంతోషంగా ఉందన్నాడు.

‘జట్టు సమావేశాల్లో మేం అమ్మాయిల గురించి మాట్లాడుకునేవాళ్లం. వారిలాగే విజయాలు సాధించాలని అనుకున్నాం. వారు తొలి మూడు మ్యాచుల్లో ఓడిపోయినా బలంగా పుంజుకున్నారు. క్వార్టర్‌, సెమీస్‌ ఆడారు. అది నిజంగా మాలో స్ఫూర్తి నింపింది’ అని డ్రాగ్‌ఫ్లికర్‌ రూపిందర్‌ అన్నాడు.

ఆస్ట్రేలియా చేతిలో 1-7తో ఓడినా తాము పుంజుకున్నామని రూపిందర్‌ తెలిపాడు. ‘మేమంతా ఆ ఓటమితో నిరాశపడ్డాం. మేం మరీ చెడ్డగా ఆడలేదు. ఆ తర్వాత వీడియోలను విశ్లేషించినా మేం బాగానే ఆడినట్టు కనిపించింది. మాకు అవకాశాలు లభించాయి. కానీ ఆ రోజు ఆసీస్‌ బాగా ఆడింది. మా సర్కిల్‌లోకి వచ్చిన ప్రతిసారీ గోల్స్‌ చేశారు. ఏదేమైనా మేమొక కుటుంబంలా ఉండాలనే అనుకున్నాం. ఎవరినీ నిందించుకోలేదు. విమర్శలను పట్టించుకోకుండా ముందుకెళ్లాం. దేవుడి దయ ఉంది కాబట్టే పతకం గెలిచాం’ అని రూపిందర్‌ తెలిపాడు.

‘హాకీ ఆడటం మొదలు పెట్టినప్పటి నుంచే నేను పతకం గురించి కలగన్నా. ఆ సమయంలో నేనిది సాధిస్తానని అనుకోలేదు. ఎందుకో ఈ పతకం చాలా అందంగా ఉందనిపిస్తోంది. ఈ పతకం కోసం మేం డబ్బులివ్వలేదు. ఇది మా శ్రమ, అంకితభావం, త్యాగాలు, కష్టాల ఫలితం. అందరం మానసికంగా శారీరకంగా కష్టపడ్డాం. మహనీయుల వారసత్వం కొనసాగించినందుకు ఆనందంగా ఉంది’ అని రూపిందర్‌ వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని