IND vs NZ: ఇది రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో అరుదైన తప్పిదం: ఆకాశ్‌ చోప్రా

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ.. కెప్టెన్సీ పరంగా ఒక అరుదైన తప్పిదం చేశాడని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా...

Published : 18 Nov 2021 14:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ.. కెప్టెన్సీ పరంగా ఒక అరుదైన తప్పిదం చేశాడని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా బౌలింగ్‌పై ఆకాశ్‌ తన యూట్యూబ్‌ ఛానల్లో విశ్లేషణ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘టీమ్‌ఇండియా ఇంతకుముందు ఆరో బౌలర్‌ కావాలని చెప్పిన నేపథ్యంలోనే ఈ మ్యాచ్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌ని ఆడించారు. కానీ, అతడికి బౌలింగ్‌ చేసే అవకాశం ఇవ్వలేదు. ఇది రోహిత్‌శర్మ కెప్టెన్సీలో చాలా అరుదైన తప్పిదమని నేను భావిస్తా. సహజంగా అతడి నాయకత్వం బాగుంటుంది. కానీ, వెంకటేశ్‌కు బౌలింగ్‌ ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థం కాలేదు’ అని ఆకాశ్‌ చెప్పుకొచ్చాడు.

‘రోహిత్‌ టాస్‌ గెలిచాక అతడిని బౌలింగ్‌కు తీసుకురావాల్సింది. ఆదిలోనే కివీస్‌ ఒక వికెట్‌ కోల్పోయి తడబడుతున్న వేళ వెంకటేశ్‌ చేత రెండు, మూడు ఓవర్లు వేయించాల్సింది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌ చేసిన దీపక్‌ చాహర్‌, మహ్మద్‌ సిరాజ్‌ ఎక్కువ పరుగులిచ్చిన నేపథ్యంలో అతడిని కూడా ఉపయోగించుకోవాల్సింది. మరోవైపు సీనియర్‌ బౌలర్లు భువనేశ్వర్‌, అశ్విన్‌ చాలా పొదుపుగా బౌలింగ్‌ చేసి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ముఖ్యంగా భువి బౌలింగ్‌లో రాణించడం విశేషం. వాళ్లిద్దరూ తమ అనుభవంతో పొదుపుగా బౌలింగ్‌ చేశారు’ అని ఈ మాజీ బ్యాట్స్‌మన్‌ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని