IND vs NZ: ఒకే ఇన్నింగ్స్‌.. అజాజ్‌ పటేల్‌ రికార్డుల పరంపర..!

న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ (10/119) అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. టీమ్ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు పడగొట్టాడు...

Updated : 07 Dec 2021 14:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ (10/119) అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. టీమ్ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు పడగొట్టాడు. దీంతో టెస్టు క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా రికార్డుపుటల్లోకి ఎక్కాడు. కాగా, ముంబయిలోనే పుట్టిన అజాజ్‌ చిన్నతనంలోనే న్యూజిలాండ్‌ కెళ్లి స్థిరపడ్డాడు. ఈ క్రమంలోనే అక్కడ క్రికెటర్‌గా ఎదిగి జాతీయ జట్టులో చేరాడు. పుట్టిన గడ్డపైనే.. అది కూడా టీమ్‌ఇండియాపైనే ఎప్పటికి గుర్తుండిపోయే బౌలింగ్‌ చేశాడు. కాగా, పది వికెట్ల క్లబ్‌లో చేరిన అజాజ్‌ను టీమ్‌ఇండియా మాజీ కోచ్‌, స్పిన్నర్‌ అనిల్ కుంబ్లే అభినందించారు. ఈ అరుదైన ఘనత సాధించి ఆ క్లబ్‌లో చేరినందుకు స్వాగతం పలికారు. ఈ రికార్డు నెలకొల్పడంలో అతడు అద్భుత నైపుణ్యం ప్రదర్శించాడని మెచ్చుకున్నారు.

ఒక్క ఇన్నింగ్స్‌తో సంచలన రికార్డులు..

* టెస్టు క్రికెట్‍లో ఒకే ఇన్నింగ్సులో 10 వికెట్లు తీసిన 3వ బౌలర్‍గా నిలిచిన అజాజ్‍ పటేల్‍.

* 1956లో తొలిసారి జిమ్‍లేకర్‍ ఆస్ట్రేలియాపై ఈ ఘనత సాధించారు. ఆపై 1999లో అనిల్‍ కుంబ్లే పాకిస్థాన్‌పై పది వికెట్ల ప్రదర్శన చేశారు.

* ఈ టెస్టు మ్యాచ్‌లో అజాజ్‌ ఒకే ఇన్నింగ్సులో మూడుసార్లు ఒకే ఓవర్లో రెండేసి వికెట్లు తీశాడు.

* మొత్తం 47.5 ఓవర్లు బౌలింగ్‌ చేసిన అజాజ్‌ 119 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు.

* న్యూజీలాండ్‍ తరఫున టెస్టుల్లో అజాజ్‍ పటేల్‍దే (10/119) అత్యుత్తమ ప్రదర్శన. 1985లో రిచర్డ్‌ హాడ్లీ (9/52) ఆస్ట్రేలియాపై మేటి పరదర్శన.

* టెస్టుల్లో భారత్‍పైనా ఏ బౌలర్‌కైనా ఇదే మెరుగైన రికార్డు. ఇంతకుముందు 1971లో జాన్‌ నోరీగా (9/95) అత్యుత్తమ ప్రదర్శన.

* భారత్‍లో విదేశీ బౌలర్‍ అత్యుత్తమ గణాంకాల రికార్డు కూడా ఇదే.

* ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్ల ప్రదర్శన జరగడం భారత్‍లో ఇది రెండోసారి.

* దాదాపు 1000 టెస్టుల తర్వాత నమోదైన ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్ల రికార్డు ఇది.

* లేకర్‍ 428వ టెస్టులో 10 వికెట్ల ఘనత సాధించగా.. కుంబ్లే 1443వ టెస్టులో ఆ రికార్డు నెలకొల్పారు. 22 ఏళ్ల తర్వాత 2438వ టెస్టులో అజాజ్‍ పటేల్‍ రికార్డు.

* భారత్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఇదివరకు నాథన్‌ లైయన్‌ (8/50), జేసన్‌ క్రేజా (8/215) అత్యుత్తమ ప్రదర్శనలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని