IND vs NZ: ధోనీ 11 సార్లు.. పంత్‌ ఇప్పుడే కొత్తగా

టీమ్‌ఇండియా బుధవారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. టాస్‌ గెలిచిన రోహిత్‌ శర్మ పూర్తిస్థాయి కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే విజయవంతమయ్యాడు...

Updated : 18 Nov 2021 13:34 IST

భారత్‌ x న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో ఆసక్తికర విశేషాలు..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా బుధవారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. టాస్‌ గెలిచిన రోహిత్‌ శర్మ పూర్తిస్థాయి కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే విజయవంతమయ్యాడు. తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకొని కివీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ క్రమంలోనే టిమ్‌ సౌథీ సారథ్యంలో ఆ జట్టు 164/6 స్కోర్‌ చేసింది. తర్వాత భారత్‌ ఐదు వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. అయితే, ఈ మ్యాచ్‌ ద్వారా పలు ఆసక్తికరమైన విశేషాలు చోటుచేసుకున్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.

ధోనీ తర్వాత పంత్‌..

ధోనీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన భారత వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌గా రిషభ్‌ పంత్‌ నిలిచాడు. అంతకుముందు మహీ 2005 నుంచి 2017 మధ్య 11 సార్లు ఈ ఘనత సాధించాడు. మరోవైపు పంత్‌ 2017లో టీమ్‌ఇండియాకు ఎంపికవ్వగా.. అతడి జెర్సీ నంబర్‌ కూడా 17 అనే సంగతి తెలిసిందే. నిన్న ఆడిన ఇన్నింగ్స్‌లోనూ 17 బంతుల్లో 17 పరుగులే చేశాడు. నిన్న తేదీ కూడా నవంబర్‌ 17 కావడం గమనార్హం.

మార్క్‌ చాప్‌మన్‌ అప్పుడు హాంకాంగ్‌.. ఇప్పుడు న్యూజిలాండ్‌..

హాంకాంగ్‌లో పుట్టి పెరిగిన మార్క్‌ చాప్‌మన్‌ అనే క్రికెటర్‌ ప్రస్తుతం న్యూజిలాండ్‌ జట్టు తరఫున ఆడుతున్నాడు. అయితే, అతడు అరుదైన రికార్డు నెలకొల్పాడు. 2015 నవంబర్‌లో హాంకాంగ్‌ తరఫున ఆడుతూ.. ఒమన్‌తో జరిగిన ఒక టీ20లో 63* పరుగులు సాధించి పొట్టి క్రికెట్‌లో తొలి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. తాజాగా న్యూజిలాండ్‌ జట్టుతో ఆడుతూ భారత్‌పైనా అన్నే పరుగులు చేశాడు. దీంతో ఆరేళ్ల వ్యవధిలో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో రెండు జట్ల తరఫున 63 పరుగులతో రెండే అర్ధశతకాలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు.

ఐదేళ్ల తర్వాత అశ్విన్‌కు తొలిసారి..

టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐదేళ్ల తర్వాత స్వదేశంలో తొలి అంతర్జాతీయ టీ20 ఆడాడు. అతడు చివరిసారి 2016 టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌తో జరిగిన సెమీఫైనల్లో పాల్గొన్నాడు. మళ్లీ ఇన్నాళ్లకు న్యూజిలాండ్‌తో బరిలోకి దిగాడు. ఇక ఈ మ్యాచ్‌కు వేదికగా నిలిచిన జైపూర్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ తొలిసారి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌కి ఆతిథ్యమిచ్చింది.

న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికాతో సమానంగా..

ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో స్వదేశంలో గత 21 లక్ష్యఛేదనల్లో 17 విజయాలను సాధించింది. దీంతో స్వదేశాల్లో ఆడి అత్యధిక విజయాలు సాధించిన జట్లలో ఒకటిగా నిలిచింది. టీమ్‌ఇండియాతో సమానంగా న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా జట్లు వారి సొంతగడ్డలపై 17 విజయాలతో ఉన్నాయి.

రోహిత్‌-రాహులే విజయవంతం..

ఇక టీ20ల్లో టీమ్‌ఇండియా తరఫున అత్యంత విజయవంతమైన జోడీగా రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ నిలిచారు. వీరిద్దరూ 26 ఇన్నింగ్స్‌ల్లో 12 సార్లు 50కి పైగా ఓపెనింగ్‌ భాగస్వామ్యాలు నమోదు చేశారు. అంతకుముందు రోహిత్‌.. ధావన్‌తో కలిసి 52 ఇన్నింగ్స్‌ల్లో 11 సార్లు ఈ ఘనత సాధించాడు. దీంతో వీరిద్దరూ టీమ్‌ఇండియా తరఫున అత్యధిక అర్ధశతక భాగస్వామ్యాలు నెలకొల్పిన ఓపెనర్లుగా రికార్డులకెక్కారు.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని