
IND vs NZ: ద్రవిడ్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న కేఎస్ భరత్: లక్ష్మణ్
ఇంటర్నెట్‌డెస్క్: టీమ్ఇండియా యువ కీపర్, బ్యాటర్ కేఎస్ భరత్ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడని దిగ్గజ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శనివారం భరత్.. వృద్ధిమాన్ సాహాకు బదులుగా వికెట్ కీపింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అతడు మూడు కీలక వికెట్లు తీయడంలో భాగస్వామి అయ్యాడు. తొలుత విల్‌యంగ్(89) క్యాచ్ అందుకోవడమే కాకుండా అంపైర్ దాన్ని నాటౌట్‌గా ప్రకటించినా.. పూర్తి విశ్వాసంతో కెప్టెన్ రహానె రివ్యూకు వెళ్లేలా చేశాడు. అక్కడ విల్ ఔటని తేలడంతో 151 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
అనంతరం రాస్ టేలర్ (11) వంటి ప్రమాదకర బ్యాట్స్‌మన్‌ను భరతే వికెట్ల వెనుక మళ్లీ క్యాచ్ అందుకొని పెవిలియన్ పంపాడు. ఇక టాప్ స్కోరర్‌గా నిలిచిన టామ్ లాథమ్ (95)ను సైతం అతడే స్టంపౌట్ చేసి న్యూజిలాండ్‌ను దెబ్బతీశాడు. ఈ నేపథ్యంలోనే లక్ష్మణ్ ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ భరత్ కీపింగ్ నైపుణ్యాలను మెచ్చుకున్నాడు. అతడి గురించి ద్రవిడ్ తనతో ముందే ఓసారి చర్చించాడని పేర్కొన్నాడు. భారత్‌లో సాహా తర్వాత అంత మంచి కీపర్ ఈ ఆంధ్రా క్రికెటరే అని పేర్కొన్నాడని గుర్తుచేసుకున్నాడు.
‘భరత్.. సెలెక్టర్లు, కోచ్ ద్రవిడ్ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం చాలా మంచి పరిణామం. వాళ్ల విశ్వాసాన్ని నిలబెట్టుకొనేలా ఆడాడు. స్పిన్ బౌలింగ్‌కు అనుకూలించే ఇలాంటి పిచ్‌లపై సరైన కీపర్ లేకపోతే పలు అవకాశాలు చేజారతాయి. ఈరోజు భరత్ నుంచి మనం చూసింది అత్యద్భుతమైన ప్రదర్శన. కొద్ది రోజుల క్రితమే జట్టులోకి వచ్చి.. అనుకోకుండా అందిన అవకాశాన్ని నిర్భయంగా సద్వినియోగం చేసుకొన్నాడు. ఇది అతడికి మంచి అనుభవంగా పనికొస్తుంది. అతడి కెరీర్ ముందుకు సాగడానికి ఇది మరింత తోడ్పడుతుంది. ఈ ప్రదర్శనతో అతడికి మంచి ఆత్మవిశ్వాసం లభిస్తుంది’ అని లక్ష్మణ్ వివరించాడు.
ఇవీ చదవండి
Advertisement