IND vs NZ: అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే గెలుస్తాం: కివీస్‌ కోచ్‌ రాంచీ

భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఐదోరోజు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే భారీ లక్ష్యాన్ని ఛదిస్తామని న్యూజిలాండ్‌ ఫీల్డింగ్‌ కోచ్‌ లూక్‌ రాంచీ అభిప్రాయపడ్డాడు...

Published : 29 Nov 2021 08:11 IST

కాన్పూర్‌: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఐదోరోజు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే భారీ లక్ష్యాన్ని ఛేదిస్తామని న్యూజిలాండ్‌ ఫీల్డింగ్‌ కోచ్‌ లూక్‌ రాంచీ అభిప్రాయపడ్డాడు. ఆదివారం ఆట ముగిశాక మీడియాతో మాట్లాడిన అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సరైన ఆలోచనా దృక్పథంతో బ్యాటింగ్‌ చేస్తూ.. అవకాశాలను ఉపయోగించుకుంటూ పరుగులు సాధిస్తే కచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు.

టీమ్‌ఇండియా నాలుగో రోజు ఆటలో 234/7 స్కోర్‌ వద్ద రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 49 పరుగులు కలుపుకొని కివీస్‌ ముందు 284 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలోనే బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు ఆటముగిసేసరికి 4/1 స్కోర్‌తో నిలిచింది. చివరి రోజు విజయం సాధించాలంటే కివీస్‌ 280 పరుగులు చేయాలి. అయితే, స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై ఆ స్కోర్‌ సాధించాలంటే న్యూజిలాండ్‌ ఎంతో పట్టుదలతో ఆడాలి. ఈ నేపథ్యంలోనే రాంచీ మాట్లాడుతూ తమ జట్టుపై ఆ నమ్మకం ఉందన్నాడు.

‘మేం గెలవాలంటే సానుకూలంగా ఉండాలి. భారత బ్యాటర్లు ఆడిన తీరు నుంచి ప్రేరణ పొందాలి. వాళ్లు ఆడినట్లే ఆడాలి. రెండో ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్ల కదలికలు కీలకంగా మారాయి. మేం కూడా ఇప్పుడు అదే చేసి పరిస్థితులను మాకు అనుకూలంగా మార్చుకోవాలి. వీలైనంత మేరకు కష్టపడాలి. అలా చేస్తే పరుగులు వాటంతట అవే వస్తాయి. ఇకపోతే నాలుగో రోజు ఆటలో మేం పలు వికెట్లు తీసి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టలేకపోయాం. దానికెంతో ప్రయాసపడ్డాం. అయినా ఐదో రోజు ఆటలో ఏ ఫలితమైనా రావొచ్చు.. ఎవరైనా గెలవచ్చు.. మ్యాచ్‌ డ్రా కూడా అవ్వచ్చు’ అని కివీస్‌ కోచ్‌ అభిప్రాయపడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని