IND vs NZ: నా ఫామ్‌ గురించి ఆందోళన లేదు: రహానె

మరికాసేపట్లో భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు కాన్పూర్‌ వేదికగా తొలి టెస్టు ఆడనున్నాయి. అంతకుముందు ఇరు జట్ల కెప్టెన్లు మీడియాతో మాట్లాడారు...

Published : 25 Nov 2021 07:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కాన్పూర్‌ వేదికగా మరికాసేపట్లో భారత్‌, న్యూజిలాండ్‌ తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ విశ్రాంతి తీసుకోవడంతో రహానె జట్టు పగ్గాలు అందుకున్నాడు. అయితే, ఫామ్‌ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న అతడు.. ఆ విషయం గురించి ఆందోళన లేదన్నాడు. తొలి టెస్టు నేపథ్యంలో రహానె, న్యూజిలాండ్‌ సారథి విలియమ్సన్‌ బుధవారం మీడియాతో మాట్లాడారు.  ‘నా ఫామ్‌ గురించి ఆందోళన లేదు. వీలైనంత వరకూ జట్టుకు సాయపడటమే నా పని. ప్రతి ఇన్నింగ్స్‌లో వంద చేయడమే సహకరించినట్టు కాదు. ఇన్నింగ్స్‌లో 40, 50 పరుగులు చొప్పున చేసినా ముఖ్యమే. భవిష్యత్‌ గురించి ఆలోచించడం లేదు. మ్యాచ్‌పైనే దృష్టి పెట్టా. స్పిన్‌కు సహకరించే పిచ్‌లపై ఆడడం భారత బ్యాటర్లకూ సవాలే. ఫామ్‌లో ఉన్న రాహుల్‌ గాయపడడం మా జట్టుకు ఎదురు దెబ్బే. అయినా అతడిని భర్తీ చేసే ఆటగాళ్లున్నారు. శ్రేయస్‌ టెస్టు అరంగేట్రం చేస్తాడు. జట్టు కూర్పుపై ఇప్పుడే ఏమీ చెప్పలేను’ అని రహానె చెప్పుకొచ్చాడు.

ఇక విలియమ్సన్‌ మాట్లాడుతూ.. ‘మొత్తం సిరీస్‌లో స్పిన్‌ నిర్ణయాత్మక పాత్ర పోషించనుంది. భారత్‌లో ఎన్నో జట్లు ఇలాంటి సవాళ్లు ఎదుర్కున్నాయి. మా అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. మా బౌలింగ్‌ బృందంలో స్పిన్నర్లు అజాజ్‌, సోమర్‌విల్లె ప్రముఖ పాత్ర పోషిస్తూ వచ్చారు. ఇలాంటి  పరిస్థితుల్లో వాళ్లు కీలకం కానున్నారు. భారత స్పిన్నర్ల బలం మాకు తెలుసు. వాళ్ల బౌలింగ్‌లో పరుగులు చేసేందుకు విభిన్నమైన మార్గాలు అన్వేషించాల్సి ఉంది. కీలక ఆటగాళ్లు లేకున్నా టీమ్‌ఇండియాను తక్కువగా చూడలేం’ అని అభిప్రాయపడ్డాడు.

ఈ పిచ్‌ ఎలా ఉండనుందనే విషయంపై  క్యూరేటర్‌ శివ్‌కుమార్‌ వివరణ ఇచ్చారు. ‘స్పిన్‌ పిచ్‌ రూపొందించాలని బీసీసీఐ నుంచి లేదా జట్టు మేనేజ్‌మెంట్‌ నుంచి ఎలాంటి సూచనలు అందలేదు. ఓ మంచి పిచ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని తయారు చేశా. ఈ కాలంలో సాధారణంగానే గాలిలో తేమ ఉంటుంది. ఈ పిచ్‌ త్వరగా పగుళ్లు రాదని చెప్పగలను. ఈ మ్యాచ్‌ మూడు రోజుల్లోనే ముగుస్తుందని అనుకోవడం లేదు. రెండో రోజు నుంచి బంతి తిరిగే అవకాశం ఉంది’ అని ఆయన చెప్పారు.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని