IND vs NZ: గండి కొట్టింది మనోళ్లే.. రచిన్‌ రవీంద్ర, అజాజ్‌ పటేల్‌ ఎవరో తెలుసా?

రచిన్‌ రవీంద్ర.. ఈ పేరు చూస్తే భారతీయుడని అర్థమైపోతుంది. కానీ అతడు పుట్టింది, పెరిగింది న్యూజిలాండ్‌లో. ఇప్పుడు ఆ దేశ జాతీయ క్రికెట్‌ జట్టుకు అతను ప్రాతినిధ్యం వహిస్తున్నాడు...

Updated : 07 Dec 2021 14:15 IST

కాన్పూర్‌: రచిన్‌ రవీంద్ర.. ఈ పేరు చూస్తే భారతీయుడని అర్థమైపోతుంది. కానీ అతడు పుట్టింది, పెరిగింది న్యూజిలాండ్‌లో. ఇప్పుడు ఆ దేశ జాతీయ క్రికెట్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆర్కిటెక్ట్‌ అయిన రచిన్‌ తండ్రి కృష్ణమూర్తిది బెంగళూరు. ఆయన మాజీ పేసర్‌ జవగళ్‌ శ్రీనాథ్‌తో కలిసి దేశవాళీ క్రికెట్‌ కూడా ఆడాడు. ఉద్యోగ రీత్యా 90వ దశకంలోనే కుటుంబంతో సహా న్యూజిలాండ్‌కు వెళ్లి స్థిరపడ్డ కృష్ణమూర్తి.. అక్కడే పుట్టిన తన కొడుకును క్రికెటర్‌ను చేయాలనుకున్నాడు. రాహుల్‌ ద్రవిడ్‌, సచిన్‌ టెండూల్కర్‌ల పేర్లు కలిసొచ్చేలా కొడుక్కి రచిన్‌ అనే పేరును కృష్ణమూర్తి పెట్టుకున్నట్లు సమాచారం. తండ్రి నమ్మకాన్ని నిలబెడుతూ టీనేజీలోనే దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన అతడు 22 ఏళ్లకే న్యూజిలాండ్‌ జట్టుకు ఎంపికయ్యాడు.

గత ఏడాది బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లో డకౌటై, వికెట్‌ తీయలేకపోయిన రచిన్‌.. రెండో టీ20లో 3 వికెట్లు పడగొట్టడమే కాకుండా 22 పరుగులు చేసి అందరి దృష్టిలో పడ్డాడు. ఇప్పుడు అతడికి టెస్టు సిరీస్‌లో అవకాశం వచ్చి సుదీర్ఘ ఫార్మాట్‌లో భారత్‌పైనే అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. బౌలింగ్‌లో రాణించకపోయినా.. చివరి రోజు కివీస్‌కు ఓటమి ఖాయమనుకున్న దశలో అసాధారణ పోరాట పటిమను ప్రదర్శించాడు. దీంతో జట్టు ఓటమిపాలవ్వకుండా గట్టెక్కించాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రచిన్‌.. 15.1 ఓవర్లు (91 బంతులు) బ్యాటింగ్‌ చేశాడు. తొలి టెస్టులో ఎంతో పరిణతితో, పట్టుదలతో అతడు బ్యాటింగ్‌ చేసిన తీరుకు అంతా ముగ్ధులైపోయారు. అశ్విన్‌, ద్రవిడ్‌ సెతౖం అతడి బ్యాటింగ్‌ను కొనియాడారు. ఆఖర్లో రచిన్‌కు సహకరించిన అజాజ్‌ పటేల్‌ కూడా భారత్‌కు చెందినవాడే కావడం మరో విశేషం. ముంబయిలో జన్మించిన అతడు న్యూజిలాండ్‌లో స్థిరపడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని