IND vs NZ: భారత్‌లో సవాళ్లకు సిద్ధం: ఆజాజ్‌ పటేల్‌

భారత్‌లో సవాళ్లు ఎదుర్కొంనేందుకు సిద్ధంగా ఉన్నానని న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ ఆజాజ్‌ పటేల్‌ అన్నాడు. ముంబయిలో పుట్టిన అతడు 8 ఏళ్ల వయసులో కుటుంబంతో కివీస్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు...

Published : 24 Nov 2021 01:16 IST

ముంబయిలో పుట్టి న్యూజిలాండ్‌ స్పిన్నర్‌గా ఎదిగి..

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో సవాళ్లు ఎదుర్కొంనేందుకు సిద్ధంగా ఉన్నానని న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ ఆజాజ్‌ పటేల్‌ అన్నాడు. ముంబయిలో పుట్టిన అతడు 8 ఏళ్ల వయసులో కుటుంబంతో కివీస్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌ జట్టులో స్పిన్నర్‌గా ఎదిగాడు. మరో రెండు రోజుల్లో టీమ్‌ఇండియాతో టెస్టు సిరీస్‌ ఆడేందుకు సిద్ధమయ్యాడు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆజాజ్‌ స్వదేశంలో ప్రత్యర్థి జట్టు ఆటగాడిగా ఆడటం ఆసక్తిగా ఉందన్నాడు.

‘భారత్‌లో స్పిన్నర్‌గా రాణించడం సవాళ్లతో కూడుకున్నది. అయినా, ఇక్కడ ఆడేందుకు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇక్కడ వినియోగించే ఎస్‌జీ బంతి కచ్చితంగా వైవిధ్యమైందని చెప్పగలను. అది అటుఇటుగా డ్యూక్‌ బంతిలాగే ఉంటుంది. ఈ బంతి కొంచెం గట్టిగా ఉండటంతో బౌలింగ్‌ చేసేందుకు గ్రిప్ సాధించాను. మా సన్నద్ధం కూడా బాగా సాగుతోంది. మైదానంలో దిగేందుకు ఇంకా సమయం ఉన్నందున ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడటం ముఖ్యమైన విషయం’ అని అజాజ్‌ చెప్పుకొచ్చాడు.

ఇక తన సహచర స్పిన్నర్‌ సోమర్‌విల్లే గురించి వివరిస్తూ.. తాము ఒకరికి ఒకరు సహకరించుకుంటామని, విలువైన సూచనలు చేసుకుంటామని అజాజ్‌ పేర్కొన్నాడు. సోమర్‌విల్లే తగిన ఎత్తులో బౌన్స్‌తో కూడిన బంతులు వేస్తే తాను లోపిచ్‌ బంతులు వేస్తానన్నాడు. తమ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉందన్నాడు. ఇదివరకు పలు మ్యాచ్‌లు కలిసి ఆడామని, ఇప్పుడు భారత్‌లో మరోసారి ఆ అవకాశం దక్కిందని తెలిపాడు. కాగా, గురువారం నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌లో న్యూజిలాండ్ ఈ ఇద్దరి స్పిన్నర్లనే బరిలోకి దింపనుందని తెలిసింది. కాగా, ఇప్పటివరకూ కివీస్‌ తరఫున 9 టెస్టులు ఆడిన ఆజాజ్‌ 26 వికెట్లు తీశాడు. భారత్‌లో ఎలా రాణిస్తాడో వేచిచూడాలి.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని