Rahul Dravid: డ్రస్సింగ్‌ రూమ్‌లో ద్రవిడ్‌ స్పందన ఇదీ

శ్రీలంకతో రెండో వన్డేలో టీమ్‌ఇండియా విజేతలా ఆడిందని కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నారు. ఒకవేళ ఓటమి పాలైనా ఆటతీరు మాత్రం అద్భుతమే అంటానని తెలిపారు. తొలి వన్డేలో ఓటమికి ప్రత్యర్థి కచ్చితంగా స్పందిస్తుందని ఊహించామని పేర్కొన్నారు...

Published : 22 Jul 2021 01:16 IST

కొలంబో: శ్రీలంకతో రెండో వన్డేలో టీమ్‌ఇండియా విజేతలా ఆడిందని కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నారు. ఒకవేళ ఓటమి పాలైనా ఆటతీరు మాత్రం అద్భుతమే అంటానని తెలిపారు. తొలి వన్డేలో ఓటమికి ప్రత్యర్థి కచ్చితంగా స్పందిస్తుందని ఊహించినట్లు పేర్కొన్నారు. సిరీసును 2-0తో కైవసం చేసుకున్న తర్వాత మిస్టర్‌ వాల్‌ డ్రస్సింగ్‌ రూమ్‌లో ప్రేరణ కల్పించేలా మాట్లాడారు.

‘మేం సరైన ఫలితమే సాధించాం. కుర్రాళ్లు అద్భుతంగా ఆడారు. ఒకవేళ మేం ఓడిపోయినా మా పోరాటం గొప్పదనే అంటాను. అందుకే మీ అందరికీ అభినందనలు’ అని ద్రవిడ్‌ అన్నారు.

‘శ్రీలంక స్పందిస్తుందని ముందే ఊహించాం. ప్రత్యర్థిని గౌరవించాలని అనుకున్నాం. ఎందుకంటే వారిదీ అంతర్జాతీయ జట్టే. అందుకు తగ్గట్టే వారు స్పందించారు. మేం విజేత జట్టులా బదులిచ్చాం’ అని ద్రవిడ్‌ పేర్కొన్నారు.

‘ఈ సమయంలో వ్యక్తిగత ప్రదర్శనల గురించి మాట్లాడటం సరికాదు. నిజమే, కొందరు గొప్పగా ఆడారు. చివరి వరకు పోరాడారు. మేం దాని గురించి మాట్లాడుకున్నాం. ఈ ఆటలో అందరి భాగస్వామ్యాన్ని మేం గుర్తించి ప్రశంసిస్తాం. మొత్తంగా చూస్తే జట్టు ప్రదర్శన బాగుంది. బౌలింగ్‌, బ్యాటింగ్‌, ఆరంభంలో సమష్టితత్వంతో పోరాడారు’ అని మిస్టర్‌ వాల్‌ అన్నారు.

భువి, దీపక్‌ చాహర్‌, సూర్యకుమార్‌ సైతం మాట్లాడారు. ‘నాకైతే మాటల్లేవ్‌. నేనాడిన గొప్ప మ్యాచుల్లో ఇదీ ఒకటి. ఇది మర్చిపోలేని విజయం’ అని సూర్య అన్నాడు. ‘భువీ, దీపక్‌ అద్భుతంగా ఆడారు. మేం దీపక్‌ బ్యాటింగ్‌ గురించి మాట్లాడుకొనేవాళ్లం. ఈ రోజు అతడు దానిని నిరూపించుకున్నాడు. ఇదంతా జట్టు కష్టం’ అని అతడు పేర్కొన్నాడు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని