INDvsSL: గర్జించిన గబ్బర్‌ సేన

శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టు నిర్దేశించిన 263 పరుగుల లక్ష్యాన్ని గబ్బర్‌సేన మూడు వికెట్లు కోల్పోయి 36.4 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ (86 నాటౌట్‌; 95 బంతుల్లో 6x4, 1X6), అరంగేట్రం బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌ కిషన్‌ (59; 42 బంతుల్లో

Updated : 27 Feb 2024 18:58 IST

మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ శుభారంభం  

తొలి వన్డేలో టీమ్‌ఇండియా ఘన విజయం..

కొలంబో: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టు నిర్దేశించిన 263 పరుగుల లక్ష్యాన్ని గబ్బర్‌సేన మూడు వికెట్లు కోల్పోయి 36.4 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ (86 నాటౌట్‌; 95 బంతుల్లో 6x4, 1X6), అరంగేట్రం బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌ కిషన్‌ (59; 42 బంతుల్లో 8x4, 2x6) అర్ధ శతకాలతో ఆకట్టుకోగా.. ఇతర బ్యాట్స్‌మెన్‌లో పృథ్వీ షా (43; 24 బంతుల్లో 9x4), మనీశ్‌ పాండే (26; 40 బంతుల్లో 1x4, 1x6), సూర్యకుమార్‌ యాదవ్‌ (31 నాటౌట్‌; 20 బంతుల్లో 5x4) తమవంతు పరుగులు చేశారు.

చెలరేగిన పృథ్వీ, ఇషాన్‌..

తొలుత ఓపెనర్లు పృథ్వీ, ధావన్‌ శుభారంభం చేశారు. ముఖ్యంగా పృథ్వీ పవర్‌ప్లేలో రెచ్చిపోయాడు. అతడు ఉన్నది కొద్దిసేపే అయినా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ధావన్‌తో కలిసి తొలి వికెట్‌కు 58 పరుగులు చేశాడు. అందులో పృథ్వీ చేసినవే 43 పరుగులు కావడం గమనార్హం. అయితే, అర్ధశతకానికి చేరువైన సమయంలో అతడు ధనంజయ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. లాంగాన్‌లో అవిష్క ఫెర్నాండో చేతికి చిక్కాడు. తర్వాత వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌గా వచ్చిన ఇషాన్‌ కిషన్‌ సైతం వచ్చీ రావడంతోనే బౌండరీలతో చెలరేగాడు. అతడు ఎదుర్కొన్న తొలి రెండు బంతులను సిక్సర్‌, ఫోర్‌గా మలిచాడు. మరోవైపు ధావన్‌ నెమ్మదిగా ఆడుతూ అతడికి సహకరించాడు. అలా స్కోరు బోర్డు మరోసారి పరుగులు పెట్టింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ రెండో వికెట్‌కు 85 పరుగులు జోడించారు.

అయితే, అర్ధశతకం తర్వాత మరింత వేగంగా పరుగులు తీసే క్రమంలో ఇషాన్‌ ఔటయ్యాడు. సందకన్‌ బౌలింగ్‌లో భానుక చేతికి చిక్కాడు. అప్పటికి జట్టు స్కోర్‌ 143/2గా నమోదైంది. తర్వాత క్రీజులోకి వచ్చిన మనీశ్‌ పాండే తొలుత నెమ్మదిగా ఆడాడు. అనంతరం ధావన్‌తో కలిసి లంక బౌలర్లను కాచుకున్నాడు. మూడో వికెట్‌కు వీరిద్దరూ 72 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, జట్టు స్కోర్‌ 215 పరుగుల వద్ద మనీశ్‌ ఔటయ్యాడు. అప్పటికే భారత్ విజయం ఖాయం కాగా, సూర్యకుమార్‌ వచ్చి మిగతా పనిపూర్తి చేశాడు. లంక బౌలర్లలో ధనంజయ రెండు వికెట్లు తీయగా సందకన్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.

మరోవైపు టాస్‌గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. చివర్లో కరుణరత్నె(43 నాటౌట్‌; 35 బంతుల్లో 1x4, 2x6) ధాటిగా ఆడి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో (32; 35 బంతుల్లో 2x4, 1x6), మినోద్‌ భానుక (27; 44 బంతుల్లో 3x4) శుభారంభం చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 49 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే ఫెర్నాండో..  చాహల్‌ బౌలింగ్‌లో మనీశ్‌ పాండే చేతికిచిక్కి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆపై కుల్‌దీప్‌ యాదవ్‌ వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ భానుక రాజపక్స (24; 22 బంతుల్లో 2x4, 2x6), మరో ఓపెనర్‌ మినోద్‌ భానుకను ఒకే ఓవర్‌లో పెవిలియన్‌ పంపాడు. దీంతో శ్రీలంక ఒత్తిడిలో కూరుకుపోయింది.

తర్వాత ధనుంజయ డి సిల్వ(14) స్వల్ప స్కోరుకే కృనాల్‌ పాండ్య బౌలింగ్‌లో ఔటయ్యాడు. అప్పటికి లంక స్కోర్‌ 25 ఓవర్లలో 117/4గా నమోదైంది. తర్వాత జోడీ కట్టిన అసలంక (38; 65 బంతుల్లో 1x4), షనక (39; 50 బంతుల్లో 2x4, 1x6) నిలకడగా ఆడారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 49 పరుగులు జోడించారు. అనంతరం పరుగుల వేగం పెంచే క్రమంలో స్వల్ప వ్యవధిలో ఇద్దరూ ఔటయ్యారు. చివర్లో చమీరా (13; 7 బంతుల్లో 1x4, 1x6)తో కలిసి ధాటిగా ఆడిన కరుణరత్నె లంకకు పోరాడే స్కోర్‌ అందించాడు. భారత బౌలర్లలో చాహల్‌, చాహర్‌, కుల్‌దీప్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా కృనాల్‌, హార్దిక్‌ పాండ్య చెరో వికెట్‌ తీశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని