
Tokyo Paralympics: డిస్కస్‌త్రోలో వినోద్ కుమార్‌కు కాంస్య పతకం
(Photo: Tokyo2020ForIndia Twitter)
టోక్యో: పారాలింపిక్స్‌లో భారత్ పతకాల పరంపర కొనసాగుతోంది. పురుషుల హైజంప్ T47 పోటీల్లో భారత అథ్లెట్ నిషాద్ కుమార్ 2.06 మీటర్ల ఎత్తు దూకి రజతం సాధించిన గంటలోనే మరో అథ్లెట్ వినోద్ కుమార్ డిస్కస్‌త్రో విభాగంలో కాంస్యం సాధించాడు. దాంతో భారత్‌కు ఒకే రోజు మూడో పతకం ఖాయం చేశాడు. కొద్దిసేపటి క్రితం జరిగిన F52 డిస్కస్‌త్రో పోటీల్లో 41 ఏళ్ల వినోద్.. 19.91 మీటర్ల దూరం డిస్కస్ త్రో చేసి మూడో స్థానంలో నిలిచాడు. దీంతో పారాలింపిక్స్‌లో పతకం సాధించడమే కాకుండా ఆసియాలోనే అత్యుత్తమ రికార్డు నెలకొల్పిన అథ్లెట్‌గా ప్రత్యేక గుర్తింపు సాధించాడు. మరోవైపు పోలాండ్‌కు చెందిన పీయోటర్ కోసెవిక్జ్ 20.02 మీటర్లతో స్వర్ణం సాధించగా క్రోయేషియాకు చెందిన వెలిమిర్ సాండర్ 19.98 మీటర్లతో రజతం దక్కించుకున్నాడు.
పదేళ్ల పాటు మంచానికే..
వినోద్ కొద్ది సంవత్సరాల క్రితం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్)లో చేరాక ట్రైనింగ్‌లో భాగంగా లేహ్‌లో ఒక కొండను ఎక్కుతూ ప్రమాదవశాత్తూ కిందపడ్డాడు. దాంతో ఆయన కాళ్లకు గాయాలై సుమారు పదేళ్ల పాటు మంచానికే పరిమితమయ్యాడు. అదే సమయంలో అతడి తల్లిదండ్రులు కూడా మృత్యువాత పడ్డారు. ఇలాంటి కష్టాల నుంచి బయటపడిన వినోద్ పారాలింపిక్స్‌లో సత్తా చాటాడు. కాగా, ఆయన తండ్రి కూడా భారత ఆర్మీలో సేవలందించారు. 1971 భారత్-పాక్ యుద్ధంలో పాల్గొని దేశసేవలో పాలుపంచుకున్నారు.