Ind vs SL: ఆఖరి వన్డేకు టీమ్‌ఇండియా భారీ మార్పులు.. లంకేయులను ఊడ్చేస్తారా?

వన్డే సిరీసును 2-0తో కైవసం చేసుకున్న టీమ్‌ఇండియా మూడో పోరుకు సిద్ధమైంది. ఆఖరి వన్డేలో విజయ దుందుభి మోగించాలని పట్టుదలతో ఉంది. ప్రయోగాలే లక్ష్యమైనా....

Updated : 22 Jul 2021 16:03 IST

వన్డే సిరీసును 2-0తో కైవసం చేసుకున్న టీమ్‌ఇండియా మూడో పోరుకు సిద్ధమైంది. ఆఖరి వన్డేలో విజయ దుందుభి మోగించాలని పట్టుదలతో ఉంది. ప్రయోగాలపై దృష్టిపెట్టినా.. లంకను క్లీన్‌స్వీప్‌ చేయడమే గబ్బర్‌ సేన ప్రధాన లక్ష్యం! మరోవైపు వరుస ఓటములతో కుదేలైన సింహళీయులు ఒక్క మ్యాచైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో టీ20 సిరీసుకు వెళ్లాలని అనుకుంటున్నారు.


ప్రతిఘటన ఎదురవుతుందా?

తొలి వన్డేలో లంకేయులు నిర్దేశించిన మోస్తరు లక్ష్యాన్ని టీమ్‌ఇండియా ఊదిపారేసింది. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ సమయోచిత ఇన్నింగ్స్‌ ఆడగా కుర్రాళ్లు పృథ్వీషా, ఇషాన్‌ కిషన్‌ దుమ్మురేపారు. దూకుడుగా ఆడి త్వరగా విజయం అందించారు. రెండో మ్యాచులో మాత్రం వీరికి సవాళ్లు ఎదురయ్యాయి. 65 పరుగులకే ఈ ముగ్గురూ వెనుదిరిగారు. క్లిష్ట పరిస్థితుల్లో సూర్యకుమార్‌ యాదవ్‌, మనీశ్‌ పాండే, దీపక్‌ చాహర్‌, కృనాల్‌ పాండ్య ఒత్తిడికి నిలిచారు. వెంటవెంటనే వికెట్లు కోల్పోయినా.. దీపక్‌ చాహర్‌ తన అద్భుత బ్యాటింగ్‌తో లంకేయుల ఆశలను చిదిమేశాడు. మూడో వన్డేలోనూ లంకేయుల నుంచి ప్రతిఘటన ఎదురవ్వొచ్చు.


ఓపెనర్‌ ఎవరు?

మూడో వన్డేలో గబ్బర్‌సేనలో మార్పు చేర్పులు స్పష్టం! గబ్బర్‌తో పాటు మరో కొత్త ఓపెనర్‌ బరిలోకి దిగొచ్చు. పృథ్వీ షా (43, 13) స్థానంలో దేవదత్‌ పడిక్కల్‌, రుత్‌రాజ్‌ గైక్వాడ్‌లో ఒకరికి  అవకాశం దక్కొచ్చు. టీ20 ప్రపంచకప్‌నకు షాను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం తప్పించడం కష్టం. ఫస్ట్‌క్లాస్‌లో మాత్రం పడిక్కల్‌, రుతురాజ్‌కు మంచి అనుభవం ఉంది. పరుగుల వరద పారించారు. మిడిలార్డర్లో మనీశ్‌ పాండే, సూర్యకుమార్‌ యాదవ్‌ వెన్నెముక. పైగా సమయోచితంగా ఆడుతున్నారు. వికెట్‌ కీపర్‌గా కిషన్‌ బదులు సంజు శాంసన్‌ వస్తే ఆశ్చర్యమేం లేదు. పైగా ద్రవిడ్‌కు అతడిపై గురి ఎక్కువే.


సకారియా అరంగేట్రం చేస్తాడా?

ఫిట్‌నెస్‌ ఇబ్బందులేం లేవు కాబట్టి హార్దిక్‌ పాండ్యకు చోటు ఖాయమే. టీ20 సిరీసును దృష్టిలో పెట్టుకుంటే విశ్రాంతినివ్వొచ్చు. కృనాల్‌ పాండ్యను జట్టులోంచి తప్పించలేని స్థితి. మణికట్టు మాంత్రికులు కుల్‌దీప్‌ (2/48, 0/55), యూజీ (2/52, 3/50) అదరగొట్టారు. పొట్టి క్రికెట్‌ నేపథ్యంలో వీరి స్థానంలో రాహుల్‌ చాహర్‌, కృష్ణప్ప గౌతమ్‌ను ఆడించొచ్చు. ఇప్పుడు భువీతో దీపక్‌ చాహర్‌ పేస్‌ బాధ్యతలు పంచుకుంటున్నాడు. అతడి స్థానంలో నవదీప్‌ సైనిని ఆడిస్తారా? ఎడమచేతి వాటం పేసర్‌ చేతన్‌ సకారియాతో అరంగేట్రం చేయిస్తారా చూడాలి! నకుల్‌ బంతులు వేయడంలో దిట్టైన దీపక్‌కు విశ్రాంతినివ్వడం తప్పదనే తెలుస్తోంది.


ఆత్మవిశ్వాసంతో వెళ్తారా?

శ్రీలంక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మొదటి వన్డేలో పూర్తిగా తేలిపోయినా రెండో మ్యాచులో గట్టిపోటీనిచ్చారు. ఐతే గెలిచే మ్యాచులో ఓటమి వారి ఆత్మవిశ్వాసం దెబ్బతీస్తుందనడంలో సందేహం లేదు. ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో, మినోద్‌ భనుక మంచి ఆరంభాలే ఇస్తున్నారు. ఆ శుభారంభాలను మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ భారీ స్కోరుగా మలవడం లేదు. మధ్య ఓవర్లలో ఎక్కువ బంతులు తింటూ వికెట్లు పారేసుకుంటున్నారు. కెప్టెన్‌ దసున శనక, ధనంజయ డిసిల్వా ఫర్వాలేదనిపిస్తున్నా ఎక్కువ పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. మైదానంలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కోచ్‌ మైక్‌ ఆర్థర్‌.. ఆగ్రహం వ్యక్తం చేయకుండా ప్రోత్సహిస్తే మంచిది. చివరి మ్యాచులో లెగ్‌స్పిన్‌తో ఆకట్టుకున్న వనిందు హసరంగ మరోసారి కీలకం కానున్నాడు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని