INDvsENG: ఇంగ్లాండ్‌ ఆశలకు గండి.. బుమ్రా, షమి రికార్డు భాగస్వామ్యం

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌ ముగిసింది. కోహ్లీసేన 298/8 స్కోర్‌ వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 391 పరుగులకు ఆలౌటయ్యాక...

Updated : 16 Aug 2021 19:02 IST

లండన్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌ ముగిసింది. కోహ్లీసేన 298/8 స్కోర్‌ వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 391 పరుగులకు ఆలౌటయ్యాక.. 27 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ చివరికి ఆతిథ్య జట్టు ముందు 272 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. జస్ప్రిత్‌ బుమ్రా (34 నాటౌట్‌; 64 బంతుల్లో 3x4), మహ్మద్‌ షమి (56 నాటౌట్; 70 బంతుల్లో 6x4, 1x6) రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లాండ్‌ గెలుపు ఆశలకు గండి కొట్టారు.

సోమవారం 181/6 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో భారత్‌ తన ఆట ప్రారంభించింది. జట్టును ఆదుకుంటాడని భావించిన యువ బ్యాట్స్‌మన్‌ రిషభ్ పంత్‌ (22; 46 బంతుల్లో 1×4) త్వరగానే పెవిలియన్‌ చేరాడు. రాబిన్సన్‌ వేసిన 85.3వ ఓవర్‌కు కీపర్‌ జోస్‌ బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. కాసేపటికే జట్టు స్కోరు 209 వద్ద ఇషాంత్‌ శర్మ (16; 24 బంతుల్లో 2×4) సైతం రాబిన్‌సన్‌ బౌలింగ్‌లో వికెట్లముందు దొరికిపోయాడు. అయితే, ఎనిమిదో వికెట్‌కు జోడీ కట్టిన షమి, బుమ్రా ఇంగ్లాండ్‌ బౌలర్లను ఆడుకున్నారు. వీరిద్దరూ సింగిల్స్‌ తీస్తూనే వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు సాధించారు. స్కోరు బోర్డును పరుగులు పెట్టించి ఎనిమిదో వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఈ క్రమంలోనే భారత్‌ తొలి సెషన్‌ పూర్తయ్యేసరికి 286/8తో నిలిచింది. ఇక రెండో సెషన్‌ ప్రారంభమైన రెండో ఓవర్‌లోనే ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయగా ఆతిథ్య జట్టు బ్యాటింగ్‌ ప్రారంభించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని