
INDvsENG: రెండో రోజు భోజన విరామం.. భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లాండ్
లీడ్స్: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు భోజన విరామ సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 182/2 స్కోర్‌తో నిలిచింది. డేవిడ్ మలన్(27), జో రూట్(14) పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. 120/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో గురువారం ఆట ప్రారంభించిన ఆతిథ్య జట్టు ఈ సెషన్‌లో ఓపెనర్ల ఇద్దరి వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలోనే జోడీ కట్టిన మలన్, రూట్ మరో వికెట్ పడకుండా తొలి సెషన్‌ను ముగించారు. దాంతో ఇంగ్లాండ్ మెరుగైనస్థితిలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఆ జట్టు ఆధిక్యం 104 పరుగులుగా నమోదైంది. తొలిరోజు తమ బ్యాటింగ్‌తో భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించిన ఇంగ్లిష్ ఓపెనర్లు రోరీ బర్న్స్ (61), హసీబ్ హమీద్(68) ఔటయ్యారు. తొలుత షమి.. బర్న్‌ను బౌల్డ్ చేయగా తర్వాత జడేజా.. హమీద్‌ను బౌల్డ్ చేశాడు. దాంతో ఇంగ్లాండ్ ఈ సెషన్‌లో రెండు వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది.