Updated : 26/09/2021 13:46 IST

IPL 2021: ప్లే ఆఫ్స్ బెర్తే లక్ష్యంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌ పాయింట్ల పట్టికలో దూసుకుపోతోంది. రెండో దశలో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలుపొంది దిల్లీకి దీటుగా టాప్‌లో కొనసాగుతోంది. మరోవైపు తొలి భాగంలో సరిగా ఆడలేని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ రెండో దశలో అద్భుతంగా పుంజుకుంది. దీంతో రెండు జట్ల మధ్య ఆదివారం జరిగే పోరు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

ప్లే ఆఫ్స్‌ చేరడమే లక్ష్యం..చెన్నై

ధోనీ సారథ్యంలో చెన్నై గతేడాది పేలవ ఆటతీరు ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అయితే, ఈసారి ఎలాగైనా టైటిల్‌ సాధించాలనే కసితో కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ జట్టులో టాప్ఆర్డర్‌ మొత్తం ఫామ్‌లో ఉండటమే అందుకు కారణం. ఓపెనర్లు రుతురాజ్‌, డుప్లెసిస్‌ సూపర్‌ ఫామ్‌లో ఉండగా తర్వాత మొయిన్‌ అలీ, అంబటి రాయుడు జట్టుకు అవసరమైన పరుగులు చేస్తున్నారు. దీంతో బ్యాటింగ్‌ విభాగంలో ఒకరు ఔటయితే మరొకరు బాధ్యత తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రెండో దశలో ముంబయితో తలపడిన సందర్భంగా రుతురాజ్ ఒక్కడే ఒంటి చేత్తో బ్యాటింగ్‌ చేశాడు. జడేజా, బ్రావోతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు.

మిడిల్‌ ఆర్డర్‌లో జడేజా, బ్రావో రాణిస్తున్నా కీలకమైన సురేశ్‌ రైనా, కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ అంతగా ప్రభావం చూపలేకపోతున్నారు. అయితే గత మ్యాచ్‌లో మాత్రం చివర్లో వచ్చి జట్టును గెలిపించారు. ఇప్పటివరకు టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌తో బండిని నెట్టుకొస్తున్న చెన్నై.. ఊహించని పరిణామాలు ఎదురైతే మిడిల్‌ ఆర్డర్‌లో వీరిద్దరు ఆదుకోవాల్సి ఉంటుంది. ఇక బౌలింగ్‌ విభాగంలో చెన్నైకు ఎదురు లేదనే చెప్పాలి. ఎందుకంటే దీపక్‌ చాహర్‌, బ్రావో, శార్దూల్‌ రాణిస్తూ చెన్నై విజయాలకు వెన్నెముకలా నిలుస్తున్నారు. ఆ జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసి మోస్తరు స్కోర్‌ సాధించినా, లేక ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్‌లో ధాటిగా ఆడుతూ మ్యాచ్‌పై పట్టు సాధించేలా కనిపిస్తున్నా.. ఈ ముగ్గురూ చెలరేగిపోతున్నారు. కీలక సమయాల్లో వికెట్లు పడగొడుతూ చెన్నై విజయాలకు బాటలు వేస్తున్నారు. అందుకు గత రెండు మ్యాచ్‌లే నిదర్శనం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 14 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న ధోనీసేన నేడు కోల్‌కతాతో తలపడే మ్యాచ్‌లో విజయం సాధిస్తే దిల్లీతో సమానంగా ప్లేఆఫ్స్‌ చేరే అవకాశం ఉంది.

టాప్‌లోకి వెళ్లాలని: కోల్‌కతా

మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్‌ ఈ సీజన్‌ తొలి భాగంలో పలు ఓటములు చవిచూసి పాయింట్ల పట్టికలో వెనుకంజలో పడింది. ఓపెనర్ల వైఫల్యాలకు తోడు తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్‌ సరైన భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోవడంతో ఆ పరిస్థితి ఎదురైంది. అయితే, రెండో భాగంలో యువ బ్యాట్స్‌మన్ వెంకటేశ్‌ అయ్యర్‌కు అనూహ్యంగా ఓపెనర్‌గా అవకాశం ఇవ్వడంతో సద్వినియోగం చేసుకున్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లో బెంగళూరు, ముంబయిలపై రాణించి ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. అలాగే రాహుల్‌ త్రిపాఠి, శుభ్‌మన్‌గిల్‌ కూడా ఫామ్‌లోకి రావడంతో కోల్‌కతా దూసుకుపోతోంది. కానీ, మిడిల్‌ ఆర్డర్‌లో కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌, దినేశ్‌ కార్తీక్‌, నితీశ్‌ రాణా లాంటి ఆటగాళ్లు రాణించాల్సిన అవసరం ఉంది. టాప్‌ఆర్డర్‌ అద్భుతంగా రాణిస్తుండటంతో ఇప్పటివరకు వీరు పెద్దగా ఆడాల్సిన అవసరం రాలేదు. కానీ ప్రతిసారి వాళ్లే రాణిస్తారని కచ్చితంగా చెప్పలేం. అలాంటప్పుడు బ్యాటింగ్‌ సమస్యల్ని అధిగమించాలంటే కోల్‌కతా మిడిల్‌ ఆర్డర్‌ సైతం బ్యాట్లకు పనిచెప్పాలి.

ఇక బౌలింగ్‌ విభాగంలో రెండో దశలో ప్రధాన పేసర్‌ కమిన్స్ లేకపోయినా కోల్‌కతా బాగా ఆడుతోంది. ముఖ్యంగా వరుణ్‌ చక్రవర్తి తన మాయాజాలంతో ప్రత్యర్థులను బుట్టలో వేసుకుంటున్నాడు. అతడికి ఫెర్గూసన్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, సునీల్‌ నరైన్‌ లాంటి నైపుణ్యమున్న బౌలర్లు తోడవంతో కోల్‌కతా పాయింట్ల పట్టికలో ముందుకు సాగుతోంది. గతేడాది యూఏఈ పిచ్‌లపై ధోనీసేనను బాగా కట్టడి చేసిన చక్రవర్తి ఈసారి కూడా అలాంటి ప్రదర్శనే చేస్తాడని జట్టు ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్‌ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాగా, ఈ సీజన్‌లో ధోనీసేన టాప్‌లో కొనసాగుతుండటంతో కోల్‌కతాపై కొంత ఆధిపత్యం చలాయించే వీలుంది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని