IPL 2021: ‘వార్నర్‌ని చూశాం.. సురేశ్‌ రైనాకూ ఇదే ఆఖరి సీజన్‌ కావొచ్చు’

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఫామ్‌ కోల్పోయి సతమతమవుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనాకు ఇదే ఆఖరి సీజన్‌ అయ్యే అవకాశం ఉందని మాజీ క్రికెటర్‌ డేల్ స్టెయిన్‌...

Published : 03 Oct 2021 01:16 IST

సీఎస్కే బ్యాట్స్‌మన్‌పై డేల్‌ స్టెయిన్‌, మంజ్రేకర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఫామ్‌ కోల్పోయి సతమతమవుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనాకు ఇదే ఆఖరి సీజన్‌ అయ్యే అవకాశం ఉందని మాజీ క్రికెటర్‌ డేల్ స్టెయిన్‌, సంజయ్‌ మంజ్రేకర్‌ విశ్లేషించారు. ఈ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌పై ఒకే ఒక్క అర్ధ శతకం సాధించిన అతడు తర్వాత ఏ మ్యాచ్‌లోనూ రాణించలేదు. దీంతో మొత్తం 11 మ్యాచ్‌ల్లో ఆడిన రైనా కేవలం 157 పరుగులే చేసి ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ క్రీడా ఛానెల్లో ముచ్చటించిన స్టెయిన్‌, మంజ్రేకర్‌ పైవిధంగా స్పందించారు.

‘ఐపీఎల్‌లో రైనాకు ఇదే చివరి సీజన్‌ అయ్యే అవకాశం ఉంది. చెన్నై జట్టులో అతడో దిగ్గజ ఆటగాడిగా కొనసాగాడు. అలాంటిది ఇప్పుడు కష్టంగా మారింది. ఎవరైనా పరుగులు చేయకపోతే పక్కకు జరగాల్సిందే. డేవిడ్‌ వార్నర్‌కు కూడా ఇదే జరిగింది. మనం చూశాం. చాలా మంది ఆటగాళ్లకూ ఇలాగే జరుగుతుంది’ అని స్టెయిన్‌ పేర్కొన్నాడు. అనంతరం స్పందించిన మంజ్రేకర్‌.. రైనాలో ఇంకా కొన్ని సీజన్లు ఆడే శక్తిసామర్థ్యాలున్నాయని, అయితే.. ఇప్పుడతడు ఒక బ్యాట్స్‌మన్‌లా కనపడట్లేదని వ్యాఖ్యానించాడు. కాగా, చెన్నై ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. రైనా ఫామ్‌లో లేకపోయినా మిగతా ఆటగాళ్లు రాణిస్తూ జట్టును విజయపథంలో నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ధోనీసేన ఆడిన 11 మ్యాచ్‌ల్లో 9 విజయాలు సాధించి టాప్‌లో దూసుకుపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని