IPL 2021: యువ పేసర్‌ హ్యాట్రిక్‌ బౌలింగ్‌.. టీమ్‌ఇండియాకు ఇదే దారి..

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పేసర్‌ హర్షల్‌ పటేల్‌ టీమ్‌ఇండియాకు దారి వెతుక్కుంటున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో కొత్త రికార్డు నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆదివారం రాత్రి ముంబయితో జరిగిన మ్యాచ్‌లో...

Published : 28 Sep 2021 01:33 IST

(Photo: Harshal Patel Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పేసర్‌ హర్షల్‌ పటేల్‌ టీమ్‌ఇండియాకు దారి వెతుక్కుంటున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో కొత్త రికార్డు నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆదివారం రాత్రి ముంబయితో జరిగిన మ్యాచ్‌లో ఈ యువ పేసర్‌ 17వ ఓవర్‌లో హ్యాట్రిక్‌ వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. అనంతరం చివరి వికెట్‌ కూడా పడగొట్టడంతో ఈ సీజన్‌లో హర్షల్‌ మొత్తం 23 మందిని పెవిలియన్‌ పంపాడు. దీంతో టీమ్‌ఇండియాకు ఎంపికవ్వకుండానే ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా యుజువేంద్ర చాహల్‌ సరసన నిలిచాడు. చాహల్‌ 2015లో ఇదే బెంగళూరు తరఫున ఆడుతూ 23 వికెట్లు పడగొట్టాడు. అప్పటికి అతడు జాతీయ జట్టుకు ఎంపికవ్వలేదు.

ప్రస్తుత సీజన్‌లో హర్షల్‌ పటేల్‌ 23 వికెట్లతో కొనసాగుతుండగా రాబోయే మ్యాచ్‌ల్లో మరిన్ని వికెట్లు తీసే అవకాశం ఉంది. దీంతో అతడు చాహల్‌ను అధిగమించడమే కాకుండా ఈ జాబితాలో కొత్త రికార్డు నెలకొల్పే సువర్ణ అవకాశం ఉంది. వీరి తర్వాత 2011లో బెంగళూరు తరఫునే శ్రీనాథ్‌ అరవింద్‌ అనే బౌలర్‌ 21 వికెట్లు తీశాడు. మరోవైపు 2018లో సన్‌రైజర్స్‌ బౌలర్‌ సిద్ధార్థ్‌ కౌల్‌ 21 వికెట్లు తీసి ఈ జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, వీరిలో అరవింద్‌ తప్ప సిద్ధార్థ్‌ కౌల్‌, చాహల్‌ టీమ్‌ఇండియా టీ20 జట్టులో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. భవిష్యత్‌లో ఇలాగే రాణిస్తే హర్షల్‌ సైతం జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావచ్చు.

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత కోహ్లీసేన 165/6 స్కోర్‌ సాధించగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (51), మాక్స్‌వెల్‌ (56) అర్ధ శతకాలతో రాణించారు. అనంతరం ఛేదనలో ముంబయి 111 పరుగులకే కుప్పకూలి బెంగళూరు చేతిలో 54 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (43), క్వింటన్‌ డికాక్‌ (24) తొలి వికెట్‌కు 57 పరుగుల శుభారంభం అందించినా తర్వాతి బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. వీరిద్దరు మినహా ఏ ఒక్కరూ రెండంకెల స్కోర్‌ సాధించలేకపోయారు. బెంగళూరు బౌలర్లలో హర్షల్‌ నాలుగు, చాహల్‌ మూడు వికెట్లు తీయగా మాక్స్‌వెల్‌ రెండు, సిరాజ్‌ ఒక వికెట్‌ తీశారు.

* ఐపీఎల్‌ చరిత్రలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తొలిసారి ముంబయిని ఆలౌట్‌ చేసింది ఈ మ్యాచ్‌లోనే.

* ఒక సీజన్‌లో బెంగళూరు రెండుసార్లు ముంబయిని ఓడించడం కూడా ఇదే తొలిసారి.

* మరోవైపు ముంబయి ఇండియన్స్‌ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలవ్వడం 2018 తర్వాత ఇదే తొలిసారి. ఆ సీజన్‌లో రోహిత్‌సేన తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని