Updated : 25/09/2021 13:39 IST

IPL 2021: ఆశలు లేని సన్‌రైజర్స్‌పై పంజాబ్‌ రాణించేనా..? 

పంజాబ్‌ x హైదరాబాద్‌ ప్రివ్యూ

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకటేమో వరుస ఓటములతో సతమతమవుతున్న జట్టు. మరొకటి గెలుపుటంచుల దాకా వెళ్లి చివర్లో బోల్తాపడుతున్న జట్టు. ప్రస్తుతం ఆ రెండు టీమ్‌లు పాయింట్ల పట్టికలో చివర్లో కొనసాగుతున్నా.. శనివారం విజయం సాధించి ముందుకు సాగాలని చూస్తున్నాయి. ఆ రెండే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, పంజాబ్‌ కింగ్స్‌. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ ఇప్పటివరకు ఒక్క విజయం మాత్రమే సాధించగా.. పంజాబ్‌ మూడు విజయాలతో ఏడో స్థానంలో నిలిచింది. అయితే, మరికాసేపట్లో జరిగే పోరులో పంజాబ్‌ గెలవాలని పట్టుదలగా ఉంది. ఒకవేళ అదే జరిగితే ముంబయితో సమానంగా నిలిచి 8 పాయింట్లు సాధిస్తుంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల ప్రస్తుత పరిస్థితి ఏంటో తెలుసుకుందాం.

వీళ్లిద్దరే కీలకం..

పంజాబ్‌ జట్టులో ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. గత మ్యాచ్‌లోనూ రాజస్థాన్‌పై శతక భాగస్వామ్యం జోడించి జట్టుకు శుభారంభం అందించారు. దీన్ని బట్టే వీరు ఎలా ఆడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇద్దరిలో ఒకరు చివరి వరకూ క్రీజులో నిలబడితే పంజాబ్‌ మరింత ఎక్కువ స్కోరు సాధించే అవకాశం ఉంది. ఇక మిగిలిన బ్యాట్స్‌మన్‌లో క్రిస్‌గేల్‌ ఫర్వాలేదనిపిస్తున్నా.. గత మ్యాచ్‌లో అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆ జట్టుపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఈ మ్యాచ్‌లో ఆడించే అవకాశం ఉంది.

మరోవైపు మిడిల్‌ ఆర్డర్‌లో నికోలస్‌ పూరన్‌, ఎయిడిన్‌ మార్‌క్రమ్‌ గత మ్యాచ్‌లో బాగా ఆడినా చివర్లో ఒత్తిడికి గురై విఫలమయ్యారు. దీంతో రాజస్థాన్‌ అనూహ్య విజయం సాధించింది. అలాగే మిడిల్‌ ఆర్డర్‌లో పలు మ్యాచ్‌ల్లో అవకాశం వచ్చిన దీపక్‌ హుడా, షారుఖ్‌ ఖాన్‌ అనుకున్నంత మేర రాణించలేదు. దీంతో పంజాబ్‌ బ్యాటింగ్‌ మొత్తం రాహుల్‌, మయాంక్‌పైనే ఆధారపడింది. ఇక బౌలింగ్‌ విభాగంలో అర్ష్‌దీప్‌ సింగ్‌ గత మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మరో ఎండ్‌లో సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమి అండగా ఉన్నాడు. అయితే, ఇతర బౌలర్లలో హర్‌ప్రీత్‌ బ్రార్‌ కాస్త ఫర్వాలేదనిపించినా ఆల్‌రౌండర్‌ అదిల్ రషీద్‌ తేలిపోయాడు. కాగా, లెగ్‌స్పిన్నర్‌ రవిబిష్ణోయ్‌కు ఈ సీజన్‌లో సరైన అవకాశాలు ఇవ్వడం లేదనే విమర్శల నేపథ్యంలో ఈరోజు తుది జట్టులోకి తీసుకునే వీలుంది.

ఆశలు లేని హైదరాబాద్‌..

ఈ సీజన్‌లో అత్యంత పేలవ ప్రదర్శనతో కొనసాగుతున్న జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌. తొలి దశలో ఒకే విజయంతో ఆఖరి స్థానంలో నిలిచిన ఆ జట్టుకు ప్లేఆఫ్స్‌ చేరే అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి. తొలి దశలో అదరగొట్టిన ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో ఇప్పుడు వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. మరోవైపు డేవిడ్‌ వార్నర్‌ పరుగులు చేయలేక ఇబ్బందులు పడుతున్నాడు. ఇక తర్వాత వచ్చే కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, మనీశ్‌ పాండే చేసే పరుగులే ఆ జట్టుకు అంతో ఇంతో గౌరవ ప్రదమైన స్కోర్‌ అందిస్తున్నాయి. వృద్ధిమాన్‌ సాహా, కేదార్‌ జాధవ్‌, అబ్దుల్ సమద్‌ లాంటి బ్యాట్స్‌మెన్‌ పూర్తిగా చేతులెత్తేశారు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌ నుంచి మెరుగైన ప్రదర్శన ఆశించడం కష్టమనే చెప్పాలి. ఇక బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌ ఒక్కడే రాణిస్తున్నాడు. ఇకనైనా భువనేశ్వర్‌, ఖలీల్‌ అహ్మద్‌, జేసర్‌ హోల్డర్ లాంటి ఆటగాళ్లు జట్టు విజయాలకు కృషి చేయాలి.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని