Virender Sehwag: మాక్స్‌వెల్‌పై అశ్విన్‌ దుమ్మెత్తి ఊదడంతో ధోనీకీ కోపం వచ్చింది

మైదానంలో జరిగే విషయాలు అక్కడితోనే వదిలేయాలని, వాటిని బయటపెట్టకూడదని మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. ఇటీవల దిల్లీ, కోల్‌కతా జట్ల మధ్య జరిగిన ఓ మ్యాచ్‌లో...

Published : 02 Oct 2021 10:22 IST

నేనెప్పుడూ ఈ విషయాన్ని బయటపెట్టలేదు: సెహ్వాగ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: మైదానంలో జరిగే విషయాలు అక్కడితోనే వదిలేయాలని, వాటిని బయటపెట్టకూడదని మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. ఇటీవల దిల్లీ, కోల్‌కతా జట్ల మధ్య జరిగిన ఓ మ్యాచ్‌లో అశ్విన్‌, మోర్గాన్‌ మధ్య ఓ వివాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. రాహుల్‌ త్రిపాఠి విసిరిన త్రో.. పంత్‌కు తగిలి బంతి దూరంగా వెళ్లడంతో దిల్లీ బ్యాట్స్‌మెన్‌ ఒక పరుగు తీశారు. దీనిపై కోల్‌కతా కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే అశ్విన్‌ ఔటయ్యాక ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. దినేశ్‌ కార్తీక్‌ కలగజేసుకొని ఇద్దర్నీ వేరు చేశాడు. అయితే, మోర్గాన్‌ మాట్లాడుతూ అశ్విన్‌ చేసింది ‘క్రీడా స్ఫూర్తి’కి విరుద్ధమని పేర్కొంటూ.. ఇంకా ఏవో మాటలు అన్నాడని తెలిసింది. ఈ విషయంపైనే సెహ్వాగ్‌ ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడుతూ తన అభిప్రాయాలు వెల్లడించాడు.

మైదానంలో జరిగే విషయాలు అక్కడితో వదిలేయాలని, వాటిని బయటకు తీసుకురావొద్దని చెప్పాడు. ‘ఇప్పుడు అశ్విన్‌-మోర్గాన్‌ మధ్య జరిగిన ఉదంతం గురించి కార్తీక్‌ బయటకు చెప్పకపోయి ఉంటే ‘క్రీడాస్ఫూర్తి’ అనే వివాదం తలెత్తేది కాదు. 2014లో నేను, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ పంజాబ్‌ జట్టుకు ఆడేటప్పుడు.. అశ్విన్‌ చెన్నైకు ప్రాతినిధ్యం వహించాడు. అప్పుడు ఒక మ్యాచ్‌లో మాక్స్‌వెల్‌ను అతడు ఔట్‌ చేశాక దుమ్మెత్తి ఊదాడు. అది మరో ఎండ్‌లో ఉన్న నాకూ నచ్చలేదు. అశ్విన్‌ అలా చేయడం ద్వారా చెన్నై కెప్టెన్‌ ధోనీకి కూడా కోపం వచ్చింది. వెంటనే మహీ.. అశ్విన్‌ను మందలించాడు. ఈ విషయాన్ని నేను అక్కడితోనే వదిలేశాను. దాన్ని మీడియా ముందు లేదా సోషల్‌ మీడియాలో ఎక్కడా ప్రస్తావించలేదు. అది తప్పో, ఒప్పో లేక క్రీడాస్ఫూర్తికి విరుద్ధమో పట్టించుకోలేదు. అలా చేయడం అశ్విన్‌ ఇష్టం. కానీ, దాన్ని ఎవరైనా మీడియా ముందు వెల్లడించినా లేదా సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నా పెద్ద వివాదాస్పదమయ్యేది. మైదానంలో ఏం జరిగినా అది ఆటగాళ్ల మధ్యే ఉండాలి. బయటకు రాకూడదు. అది వాళ్ల బాధ్యత’ అని వీరూ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని