IPL 2021: వాహ్‌..! కార్తీక్‌ త్యాగి.. నీ బౌలింగ్‌ అమోఘం: బుమ్రా, స్టెయిన్‌

రాజస్థాన్‌ రాయల్స్‌ యువ పేసర్‌ కార్తీక్‌ త్యాగి బౌలింగ్‌ చూసి టీమ్‌ఇండియా పేస్‌ గుర్రం జస్ప్రిత్‌ బుమ్రా, దక్షిణాఫ్రికా మాజీ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ ఫిదా అయ్యారు...

Published : 23 Sep 2021 01:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రాజస్థాన్‌ రాయల్స్‌ యువ పేసర్‌ కార్తీక్‌ త్యాగి బౌలింగ్‌ చూసి టీమ్‌ఇండియా పేస్‌ గుర్రం జస్ప్రిత్‌ బుమ్రా, దక్షిణాఫ్రికా మాజీ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ ఫిదా అయ్యారు. మంగళవారం రాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కార్తీక్‌ అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. పంజాబ్‌కు చివరి ఓవర్‌లో నాలుగు పరుగులు అవసరం కాగా.. ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. దీంతో రాజస్థాన్‌కు ఊహించని విజయం దక్కింది.

ఇదివరకు 2008లో ఇదే రాజస్థాన్‌ జట్టులో ఆడిన మునాఫ్‌ పటేల్‌.. ఒకసారి ముంబయి ఇండియన్స్‌తో తలపడిన సందర్భంగా ఆఖరి ఓవర్‌లో నాలుగు పరుగులు చేయకుండా నిలువరించాడు.  మ్యాచ్‌ అనంతరం బుమ్రా, స్టెయిన్‌ కార్తీక్‌ను మెచ్చుకున్నారు. ఇలా ఉత్కంఠ పరిస్థితుల్లో అద్భుతంగా బౌలింగ్‌ చేశాడని ప్రశంసించారు. ‘కార్తీక్‌.. ఏం ఓవర్‌ వేసావ్‌..! అలాంటి అత్యంత ఉత్కంఠకర పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఉండి పని పూర్తి చేశావ్‌. నీ బౌలింగ్‌ అమోఘం. అది నన్ను ఆకట్టుకుంది’ అని బుమ్రా ట్వీట్ చేశాడు. మరోవైపు స్టెయిన్‌ స్పందిస్తూ.. ‘వావ్‌.. ఇదివరకెన్నడూ లేని విధంగా ఛేదనలో అత్యుత్తమ చివరి ఓవర్‌ వేశావ్‌’ అని కీర్తించాడు. ఇక చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా స్పందిస్తూ.. ‘అద్భుతమైన మ్యాచ్‌, కార్తీక్‌ త్యాగి చాలా బాగా బౌలింగ్‌ చేశావ్‌’ అని మెచ్చుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని