Virat Kohli vs Joe Root: లాంగ్‌రూమ్‌లో తిట్టేసుకున్న కోహ్లీ, రూట్‌..

భారత్‌, ఇంగ్లాండ్‌ మూడో టెస్టుకు ముందు ఓ సంచలన విషయం తెలిసింది. దూకుడుగా ఉండే విరాట్‌ కోహ్లీ, ప్రశాంతంగా కనిపించే జో రూట్‌ తీవ్ర వాగ్వివాదానికి పాల్పడారని సమాచారం....

Published : 26 Aug 2021 01:19 IST

బృందాలుగా దూషించుకున్న ఆటగాళ్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌, ఇంగ్లాండ్‌ మూడో టెస్టుకు ముందు ఓ సంచలన విషయం తెలిసింది. దూకుడుగా ఉండే విరాట్‌ కోహ్లీ, ప్రశాంతంగా కనిపించే జో రూట్‌ తీవ్ర వాగ్వివాదానికి పాల్పడ్డారని సమాచారం. రెండో టెస్టులో విజయం సాధించిన వెంటనే ఈ ఘటన చోటు చేసుకుందని అంటున్నారు. అంతేకాదు.. రెండు జట్ల ఆటగాళ్లు గుంపులు గుంపులుగా చేరి ఒకర్నొకరు దూషించుకున్నారని తెలుస్తోంది.

ఇదంతా లార్డ్స్‌ టెస్టు మూడో రోజు నుంచి మొదలైంది. తొలి ఇన్నింగ్స్‌లో రూట్‌ అజేయంగా 180 పరుగులు చేశాడు. అప్పుడు ఆఖరి బ్యాట్స్‌మన్‌గా వచ్చిన అండర్సన్‌కు బుమ్రా షార్ట్‌పిచ్‌ బంతులు వేశాడు. గంటకు 90 మైళ్ల వేగంతో బంతులు విసరడంతో కొన్ని అతడి దేహానికి తగిలాయి. జట్టు ఆలౌట్‌ కాగానే అండర్సన్‌.. బుమ్రాను బూతులతో దూషించాడు. అక్కడి నుంచి రెండు జట్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది.

నిజానికి బుమ్రా పది బంతుల ఓవర్‌ ముగిశాక రెండు జట్ల ఆటగాళ్లు బృందాలుగా విడిపోయి లార్డ్స్‌ లాంగ్‌రూమ్‌లో తిట్టుకున్నారని డైలీ టెలిగ్రాఫ్‌లో ఓ కథనం వచ్చింది. అదే సమయంలో రెండు జట్ల కెప్టెన్లు విరాట్‌కోహ్లీ, జో రూట్‌ నువ్వా నేనా అన్నట్టుగా మాటల యుద్ధంలో తలపడ్డారట. ఒకర్నొకరు కవ్వించుకున్నారని తెలిసింది.

లార్డ్స్‌ లాంగ్‌రూమ్‌ను పవిత్రంగా భావిస్తారు! ఎందుకంటే మాజీ క్రికెటర్లు ఇక్కడకు వస్తుంటారు. మ్యాచును వీక్షిస్తుంటారు. కరోనా నిబంధనల వల్ల మాజీలను లాంగ్‌ రూమ్‌లోకి అనుమతించడం లేదు. దాంతో మైదానం నుంచే పరస్పరం దూషించుకుంటూ వచ్చిన ఆటగాళ్లు.. లాంగ్‌రూమ్‌లో బహిరంగంగా తిట్టుకున్నారట. మరింత రెచ్చిపోయారట. భోజనం చేసేటప్పుడూ ఇదే వాతావరణం కనిపించిందని తెలిసింది.

చివరికి ఈ వ్యవహారాలన్నీ టీమ్‌ఇండియాకే కలిసొచ్చాయి. ఆఖరి రోజు బుమ్రా, షమి అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పడంతో కోహ్లీసేనకు భారీ స్కోరు లభించింది. అప్పటికే జరిగిన సంఘటనలతో కసితో ఉన్న ఆటగాళ్లు ఆంగ్లేయులకు నరకం చూపించేందుకు సిద్ధమయ్యారు. కేవలం 60 ఓవర్లలోపే ఆలౌట్‌ చేసేసి 151 పరుగుల భారీ తేడాతో ఘన విజయం అందుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని