Joe Root: లార్డ్స్‌ టెస్టు నుంచి చాలా మంచి విషయాలు నేర్చుకున్నాం: రూట్

లార్డ్స్‌ మైదానంలో జరిగిన రెండో టెస్టు నుంచి మంచి విషయాలు నేర్చుకున్నామని, ఇకపై ఇతర విషయాల జోలికి వెళ్లమని ఇంగ్లాండ్‌ సారథి జోరూట్‌ స్పష్టం చేశాడు...

Updated : 24 Aug 2021 13:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: లార్డ్స్‌ మైదానంలో జరిగిన రెండో టెస్టు నుంచి మంచి విషయాలు నేర్చుకున్నామని.. ఇకపై ఇతర విషయాల జోలికి వెళ్లమని ఇంగ్లాండ్‌ సారథి జోరూట్‌ స్పష్టం చేశాడు. మూడో టెస్టుకు ముందు నిర్వహించిన వర్చువల్‌ మీడియా సమావేశంలో అతడు మాట్లాడాడు. లార్డ్స్‌లో ఐదోరోజు బుమ్రా విషయంలో ఇంగ్లాండ్‌ టీమ్‌ చేసిన తప్పులను సొంత జట్టు మాజీలే తీవ్రంగా తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో రూట్‌ ఇలా మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. మూడో టెస్టులో తాము సరైన ఆట ఆడాలనుకుంటున్నామని, ప్రత్యర్థి జట్టుతో ఎలాంటి వివాదాలకు పోదల్చుకోవడంలేదని అతడు చెప్పుకొచ్చాడు.

ఇక లీడ్స్‌ వేదికగా బుధవారం నుంచి ప్రారంభమయ్యే తర్వాతి మ్యాచ్‌లో తాము నిజాయతీగా ఉండాలనుకుంటున్నామని రూట్‌ పేర్కొన్నాడు. వ్యక్తిగతంగా ఎంత నిక్కచ్చిగా ఉంటామో ఒక బృందంలోనూ అలాగే అత్యుత్తమ ఆట ఆడాలనుకుంటున్నామని అతడు వివరించాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా సైతం బాగా ఆడాలని కోరుకుంటున్నామన్నాడు. ‘గత టెస్టు నుంచి మేం చాలా మంచి విషయాలు నేర్చుకున్నాం. కొన్ని విషయాల్లో మరో విధంగా ఆడాల్సింది. ఒక కెప్టెన్‌గా నేనూ సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సిరీస్‌లో ఇంకా మూడు టెస్టులు ఆడాలి. దాంతో అక్కడ సరైన విధంగా ఆడాలని అనుకుంటున్నాం. అలాగే రెండో టెస్టు ఓటమి నుంచి చాలా త్వరగా పుంజుకోవాలని చూస్తున్నాం’ అని రూట్ తన అభిప్రాయాలు వెల్లడించాడు.

రోవైపు ఇంగ్లాండ్‌ టీమ్‌ మూడో టెస్టులో రెండు కీలక మార్పులతో బరిలోకి దిగనుందని రూట్‌ పేర్కొన్నాడు. డామ్‌ సిబ్లీ బదులు జట్టులోకి డేవిడ్‌ మలన్‌ వస్తున్నాడని, అలాగే వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ హమీద్‌ ఓపెనర్‌ జోరూట్‌తో బరిలోకి దిగుతాడని చెప్పాడు. ఇక రెండో టెస్టులో ఐదు వికెట్లతో చెలరేగిన మార్క్‌వుడ్‌ భుజం గాయం కారణంగా దూరమయ్యాడని తెలిపాడు. అతడి స్థానంలో సాకిబ్‌ మహ్మద్‌ అరంగేట్రం చేయనున్నట్లు చెప్పాడు. వీరిద్దరూ ఇంగ్లాండ్‌ జట్టుకు ఉపయోగపడతారని కెప్టెన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, ఈ సిరీస్‌లో టీమ్‌ఇండియా ఇప్పటికే 1-0 ఆధిక్యంలో నిలవగా ఈ టెస్టులోనూ గెలుపొంది సిరీస్‌లో ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది. ఇక ఇంగ్లాండ్‌ మాత్రం రెండో టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో రగిలిపోతోంది. దాంతో ఇరు జట్ల మధ్య మూడో టెస్టు రసవత్తరంగా సాగడం ఖాయమనేలా కనిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని