Prasidh Krishna: నాలుగో టెస్టులో ప్రసిద్ధ్‌  కృష్ణ అరంగేట్రం?

టీమ్‌ఇండియా తరఫున మరో యువ బౌలర్‌ అరంగేట్రం చేయబోతున్నాడా? ఓవల్‌ టెస్టులో ఆడబోతున్నాడా? అందుకే అతడిని జట్టులోకి తీసుకున్నారా? అంటే అవుననే అనిపిస్తోంది....

Updated : 01 Sep 2021 17:25 IST

దిల్లీ: టీమ్‌ఇండియా తరఫున మరో యువ బౌలర్‌ అరంగేట్రం చేయబోతున్నాడా? ఓవల్‌ టెస్టులో ఆడబోతున్నాడా? అందుకే అతడిని జట్టులోకి తీసుకున్నారా? అంటే అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే స్టాండ్‌బై పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణను భారత జట్టులోకి ఎంపిక చేశారు.

కర్ణాటక యువ పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ మూడు నెలలుగా టీమ్‌ఇండియాతోనే ఉంటున్నాడు. స్టాండ్‌బైగా సేవలు అందిస్తున్నాడు. అతడిని ప్రధాన జట్టులోకి తీసుకున్నారు. బహుశా నాలుగో టెస్టులోనే అతడితో అరంగేట్రం చేయిస్తారని అనిపిస్తోంది. అలా కుదరకపోతే ఆఖరిదైన మాంచెస్టర్‌ టెస్టు ఆడటం ఖాయం.

సీనియర్‌ పేసర్ల పనిభారం పర్యవేక్షించేందుకు జట్టు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందని తెలిసింది. ఇప్పటికే జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్‌ వరుసగా మూడు టెస్టులు ఆడారు. రొటేషన్‌ పద్ధతిలో వారికి విశ్రాంతినివ్వాల్సిన అవసరం ఉంది. దాంతో ప్రసిద్ధ్‌ కృష్ణను ప్రధాన జట్టులోకి తీసుకుంటామన్న యాజమాన్యం అభ్యర్థనను సెలెక్షన్‌ కమిటీ అంగీకరించింది.

‘జట్టు యాజమాన్యం అభ్యర్థన మేరకు సెలక్షన్‌ కమిటీ నిర్ణయం తీసుకోవడంతో యువ బౌలర్‌ ప్రసిద్ధ్‌కృష్ణ ప్రధాన జట్టులో చేరాడు’ అని బీసీసీఐ కార్యదర్శి జే షా ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా 25 ఏళ్ల ప్రసిద్ధ్‌ ఇప్పటి వరకు తొమ్మిది ఫస్ట్‌క్లాస్‌ మ్యాచులు ఆడి 34 వికెట్లు తీశాడు. ఈ ఏడాది ఆరంభంలో టీమ్‌ఇండియా తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసి మూడు మ్యాచులు ఆడాడు. ఇంగ్లాండ్‌పై 6 వికెట్లు పడగొట్టాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని