Tokyo Paralympics: మరియప్పన్‌ తంగవేలుకు రజతం.. శరద్‌కు కాంస్యం

పారాలింపిక్స్‌లో భారత్‌ పతకాల పంట పండిస్తోంది. ఇప్పటికే 8 పతకాలు సాధించిన భారత అథ్లెట్లు మరో రెండు పతకాలు సాధించారు. 

Updated : 31 Aug 2021 18:29 IST

ప్రధాని మోదీతో మరియప్పన్‌ తంగవేలు (ఫైల్‌ పొటో)

టోక్యో: పారాలింపిక్స్‌లో భారత్‌ పతకాల పంట పండిస్తోంది. ఇప్పటికే ఎనిమిది పతకాలు సాధించిన భారత అథ్లెట్లు తాజాగా మరో రెండు పతకాలు అందించారు. పరుషుల హైజంప్‌ టీ-42 ఈవెంట్‌లో మరియప్పన్‌ తంగవేలు రజతంతో మెరిశాడు. ఇదే పోటీల్లో మరో భారత అథ్లెట్‌ శరద్‌ కుమార్ కాంస్యంతో రాణించాడు. దాంతో ఈ పారాలింపిక్స్‌లో భారత్‌ పతకాల సంఖ్య పదికి చేరింది. 2016 రియో పారాలింపిక్స్‌లో భారత్‌ 4 పతకాలే సాధించిన సంగతి తెలిసిందే. అప్పుడు మరియప్పన్‌ తంగవేలు హైజంప్‌లో స్వర్ణం ముద్దాడి తొలిసారి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. కాగా, వీరిద్దరిని మెచ్చుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో అభినందనలు తెలుపుతున్నారు.

 

ప్రధాని మోదీతో శరద్‌ కుమార్‌ (ఫైల్‌ పొటో)

ఈ పోటీల్లో అమెరికా అథ్లెట్‌ సామ్‌ గ్రూ 1.88 మీటర్ల ఎత్తు దూకి పసిడి పతకం సాధించగా... మరియప్పన్‌ 1.86 మీటర్లతో రజతం కైవసం చేసుకున్నాడు. దాంతో త్రుటిలో అతడు తొలి స్థానాన్ని కోల్పోయాడు. ఇక కాంస్యంతో ఆకట్టుకున్న శరద్‌కుమార్‌ 1.83 మీటర్లు దూకి మూడో స్థానంలో నిలిచాడు. మరోవైపు ఇదే ఈవెంట్‌లో పోటీపడిన ఇంకో భారత అథ్లెట్‌, రియో పారాలింపిక్స్‌ కాంస్య పతక విజేత వరుణ్‌ సింగ్‌ భాటి ఏడో స్థానంలో నిలిచి నిరాశపర్చాడు. కాగా, టీ-42 వర్గీకరణలో కాళ్లలో లోపం, పొడవులో వ్యత్యాసం, బలహీనమైన కండరాల శక్తి, క్రియాశీలకమైన కదలికలు లేకపోయిన అథ్లెట్లు పాల్గొంటారు. ఈ పోటీల్లో భారత అథ్లెట్లు ముగ్గురూ పతకం సాధించేలా కనిపించినా చివరికి రెండు పతకాలతో సరిపెట్టుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని