Cricket Drona: ముంబయి ‘క్రికెట్ ద్రోణా’ వాసు పరాంజే కన్నుమూత

ముంబయి క్రికెట్‌కు మారుపేరుగా నిలిచిన మాజీ క్రికెటర్‌, కోచ్‌ వాసు పరాంజే సోమవారం సాయంత్రం కన్నుమూశారు. 6 దశాబ్దాలుగా భారత క్రికెట్‌కు, ముంబయి క్రికెట్‌కు ఎనలేని సేవలు అందించిన ఆయన మరెన్నో కీలక బాధ్యతలు చేపట్టారు...

Published : 30 Aug 2021 23:50 IST

(Photo: RaviShastri Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: ముంబయి క్రికెట్‌కు మారుపేరుగా నిలిచిన మాజీ క్రికెటర్‌, కోచ్‌ వాసు పరాంజే సోమవారం సాయంత్రం కన్నుమూశారు. ఆరు దశాబ్దాలుగా భారత క్రికెట్‌కు, ముంబయి క్రికెట్‌కు ఎనలేని సేవలు అందించారు. ముంబయి క్రికెట్‌లోని పలువురు దిగ్గజాలకు కోచ్‌గా వ్యవహరించారు. ఆయన మృతి పట్ల ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌తో పాటు టీమ్‌ఇండియా దిగ్గజాలు సునీల్‌ గావస్కర్‌, రవిశాస్త్రి, దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్‌ సేన నాయకుడు రాజ్‌ ఠాక్రే  సంతాపం తెలిపారు.

82 ఏళ్ల వాసు.. 29 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 2 శతకాలతో 785 పరుగులు చేశారు. ఇవి క్రికెట్‌లో అంత మెరుగైన గణంకాలు కాకపోయినా ఆటపై ఆయనకున్న పరిజ్ఞానం ఎనలేనిది. అలాగే యువ క్రికెటర్ల మనస్తత్వాన్ని అర్థం చేసుకొని అందుకు తగ్గట్లు శిక్షణ ఇవ్వడం వాసు పరాంజే ప్రత్యేకత. 60, 70ల్లో దాదర్‌ యూనియన్‌ జట్టుకు నాయకత్వం వహించిన వాసు జట్టులో.. గావస్కర్‌, వెంగ్‌సర్కార్‌ లాంటి ఆటగాళ్లు ఆడారు. తనదైన వ్యక్తిత్వంతో అందరిలో మంచిపేరు సంపాదించారు. ఇక 1987లో బీసీసీఐ తొలిసారి ఇండోర్‌లో అండర్‌-15 నేషనల్‌ క్యాంప్‌ ఏర్పాటు చేయగా వాసు కోచ్‌గా ఉన్నారు. అప్పుడు సచిన్‌, గంగూలీ, వినోద్‌ కాంబ్లీ, ధ్రువ్‌ పాండోవ్‌(ఇప్పుడు లేరు) లాంటి యువ క్రికెటర్లు ఆయన వద్దే శిక్షణపొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని