Neeraj chopra: దూసుకెళ్తున్న బల్లెం వీరుడు.. నీరజ్‌కు ప్రపంచ రెండో ర్యాంకు

భారత జావెలిన్‌ త్రో క్రీడాకారుడు నీరజ్‌ చోప్రా వరుసగా రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధించిన అతడు అథ్లెటిక్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకు సాధించాడు..

Updated : 12 Aug 2021 17:46 IST

ముంబయి: భారత జావెలిన్‌ త్రో క్రీడాకారుడు నీరజ్‌ చోప్రా వరుసగా రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధించిన అతడు అథ్లెటిక్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకు సాధించాడు. అతడు 1315 స్కోరుతో ద్వితీయ స్థానానికి ఎగబాకాడు. 1396 స్కోరుతో జర్మనీ ఆటగాడు జొహనెస్‌ వెటెర్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పొలాండ్‌ అథ్లెట్‌ మార్సిన్‌ క్రుకోవ్‌స్కీ మూడు, చెక్‌ రిపబ్లిక్‌ ఆటగాడు జాకబ్‌ నాలుగు, జర్మనీ అథ్లెట్‌ జూలియన్‌ వెబర్‌ ఐదో స్థానాల్లో ఉన్నారు.

నీరజ్‌ చోప్రా ఒలింపిక్స్‌లో ఈటెను 87.58 మీటర్లు విసిరి పసిడి పతకం ముద్దాడాడు. భారత్‌ తరఫున వ్యక్తిగత స్వర్ణం సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇక అథ్లెటిక్స్‌లో దేశానికి వందేళ్లకు పతకం అందించి చిరస్మరణీయ విజయం సాధించాడు. ఏ పోటీల్లో పాల్గొన్నా బంగారు పతకం పట్టుకొస్తున్న నీరజ్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రతిసారీ మెరుగైన స్థానం పొందుతున్నాడు. అతడు అగ్రస్థానానికి చేరేందుకు మరెంతో సమయం పట్టకపోవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్‌లోనూ నీరజ్‌కు అనుచరులు పెరుగుతున్నారు. ఒలింపిక్స్‌కు ముందు అతడి ఖాతాను 1.43 లక్షల మంది మాత్రమే ఫాలో అయ్యేవారు. ఇప్పుడా సంఖ్య ఏకంగా 34 లక్షలకు చేరుకుంది. ప్రపంచంలో ఎక్కువమంది అనుసరించే ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్‌గా అతడు నిలవడం గమనార్హం. టోక్యో నుంచి స్వదేశానికి వచ్చిన నీరజ్‌కు అభిమానులు బ్రహ్మరథం పట్టిన సంగతి తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు