US Open: యూఎస్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరిన ప్రపంచ నంబర్‌ వన్‌ నొవాక్‌ జకోవిచ్‌

యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌ వన్‌ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ ఫైనల్‌కు చేరాడు. దీంతో క్యాలెండర్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచాడు...

Updated : 11 Sep 2021 10:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌ వన్‌ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ ఫైనల్‌కు చేరాడు. దీంతో క్యాలెండర్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచాడు. కాసేపటి క్రితం జరిగిన సెమీస్‌లో అతడు టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ను 4-6, 6-2, 6-4, 4-6, 6-2 తేడాతో ఓడించాడు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఇద్దరూ ఐదు సెట్లలో తలపడ్డారు. చివరికి జకోవిచ్‌ విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. మరో సెమీస్‌లో రష్యా ఆటగాడు డానిల్‌ మెద్వెదేవ్‌.. కెనడా ఆటగాడు ఫెలిక్స్‌ ఆగర్‌తో తలపడి 6-4, 7-5, 6-2 మూడు వరుస సెట్లను కైవసం చేసుకొని ఫైనల్‌ చేరాడు. దీంతో జకోవిచ్‌, మెద్వెదేవ్‌ టైటిల్‌ పోరులో తలపడనున్నారు.

మరోవైపు ఈ ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్ సాధించిన జకోవిచ్‌ ఇక చివరిదైన యూఎస్‌ ఓపెన్‌ కూడా సొంతం చేసుకుంటే క్యాలెండర్‌ గ్రాండ్‌స్లామ్‌ సాధించే అరుదైన అవకాశం లభించనుంది. 1969లో చివరిసారి లాడ్‌ రావర్‌ అనే దిగ్గజం ఈ ఘనత సాధించాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఆ రికార్డు నెలకొల్పే అవకాశం జకోవిచ్‌ ముందుంది. ఈ ప్రపంచ నంబర్‌వన్‌ ఆటగాడు ఇప్పటికే ఈ ఏడాది ఆస్ట్రేలియా, ఫ్రెంచ్‌, వింబుల్డన్‌లో జయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి గోల్డెన్‌ గ్రాండ్‌స్లామ్‌ సాధించాలని కలలుకన్న అతడిని జ్వెరెవ్‌ నిలువరించాడు. ఒలింపిక్స్‌లో జకోవిచ్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఏ పతకమూ సాధించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్స్‌లో గెలిస్తే చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని