Novak Djokovic: కంటతడి పెట్టి.. రాకెట్‌ నేలకేసి కొట్టి..! ఓటమి తర్వాత జకోవిచ్‌  స్పందన

యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌ వన్‌ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ ఓటమిపాలవ్వడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. రష్యా ఆటగాడు డానిల్‌ మెద్వెదెవ్‌తో తలపడిన తుదిపోరులో జకోవిచ్‌ 6-4, 6-4, 6-4 తేడాతో విఫలమయ్యాడు...

Updated : 13 Sep 2021 17:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌ వన్‌ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ ఓటమిపాలవ్వడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. రష్యా ఆటగాడు డానిల్‌ మెద్వెదేవ్‌తో తలపడిన తుదిపోరులో 6-4, 6-4, 6-4 తేడాతో విఫలమయ్యాడు. దీంతో ఈ ఏడాది ‘క్యాలెండర్‌ గ్రాండ్‌స్లామ్‌’ సాధించి చరిత్ర సృష్టించాలని కలలు కన్న అతడు మనస్తాపానికి గురయ్యాడు. ఒక దశలో తన భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాడు. మెద్వెదేవ్‌తో ఓటమిపాలయ్యాక తన రాకెట్‌ను నేలకేసి కొట్టి కన్నీటి పర్యంతమయ్యాడు. ఇప్పుడా వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి.

జకోవిచ్‌ ఈ ఏడాది తొలుత ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌, ఆపై వింబుల్డన్‌లో విజేతగా నిలిచాడు. ఈ క్రమంలోనే ఒలింపిక్స్‌లోనూ విజయం సాధిస్తాడని ఆశించినా అది జరగలేదు. దీంతో గోల్డెన్‌ గ్రాండ్‌స్లామ్‌ ఆశలు గల్లంతయ్యాయి. మరోవైపు యూఎస్‌ ఓపెన్‌లోనైనా గెలుపొంది కనీసం ‘క్యాలెండర్‌ గ్రాండ్‌స్లామ్‌’ సాధిస్తాడని ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. కాగా, జకోవిచ్‌ ఇప్పటివరకు అత్యధికంగా 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో రోజర్‌ ఫెదరర్‌, నాదల్‌ సరసన నిలిచాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టెన్నిస్‌ చరిత్రలో కొత్త అధ్యయనాన్ని లిఖిద్దామని ఉవ్విళ్లూరుతున్న అతడికి ఇదెంతో బాధ కలిగించింది.

టోర్నీ అనంతరం జకోవిచ్‌ మాట్లాడుతూ.. ఈ టైటిల్‌ కోసం తాను కొన్ని వారాలుగా మానసికంగా, శారీరకంగా ఎంతో ఒత్తిడికి లోనయ్యానని చెప్పాడు. అలాంటి కఠిన పరిస్థితుల్లోనే సన్నద్ధమవ్వాల్సి వచ్చిందన్నాడు. ఆ మానసిక సంఘర్షణను తట్టుకోవడం చాలా కష్టమైందని తెలిపాడు. చివరికి ఈ పోరు ముగిసిపోయినందుకు సంతోషంగా ఉందన్నాడు. అయితే, ఈ ఓటమి తనను తీవ్రంగా కలచివేసిందన్నాడు. తన కోసం సమయం కేటాయించిన అభిమానులకు ధన్యవాదాలు చెప్పాడు. ఇక మెద్వెదేవ్‌ మాట్లాడుతూ అభిమానులకు, జకోవిచ్‌కు క్షమాపణలు చెప్పాడు. జకోవిచ్‌ చరిత్ర తిరగరాసేందుకు సిద్ధమైనా.. తాను ఆ జైత్రయాత్రకు అడ్డుకట్ట వేశానని పేర్కొన్నాడు. టెన్నిస్‌ చరిత్రలో జకోవిచ్‌ అతిగొప్ప ఆటగాడని మెచ్చుకున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని