Pramod Bhagat: ప్రమోద్‌ భగత్‌ సంచలనం.. పారా బ్యాడ్మింటన్‌ సెమీస్‌కు చేరిక

ప్రపంచ నంబర్‌వన్‌ ప్రమోద్‌ భగత్‌ సంచలనం సృష్టించాడు. పారాలింపిక్స్‌ పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో సెమీస్‌కు దూసుకెళ్లాడు...

Published : 02 Sep 2021 23:58 IST

టోక్యో: ప్రపంచ నంబర్‌వన్‌ ప్రమోద్‌ భగత్‌ సంచలనం సృష్టించాడు. పారాలింపిక్స్‌ పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో సెమీస్‌కు దూసుకెళ్లాడు. మరొక్క మ్యాచు గెలిస్తే అతడు కనీసం రజతం ఖాయం చేస్తాడు. గ్రూప్‌-ఏలో జరిగిన రెండో మ్యాచులో ఉక్రెయిన్‌కు చెందిన ఒలెక్సండర్‌ చైర్కోవ్‌ను ఓడించాడు. 26 నిమిషాల పాటు జరిగిన మ్యాచులో 21-12, 21-9 తేడాతో ప్రత్యర్థిని వరుసగా రెండు గేముల్లో చిత్తుచేశాడు.

‘ఈ రోజు నా లయ బాగుంది. అందుకే మ్యాచ్‌ బాగా ఆడాను. చైర్కోవ్‌ మంచి ఆటగాడు. మ్యాచులో కొన్ని అద్భుతమైన షాట్లు ఆడాడు. ఏదేమైనా నేను సెమీస్‌ చేరినందుకు సంతోషంగా ఉంది. ఇక్కడి నుంచి పరిస్థితులు కఠినంగా మారతాయి. ఎందుకంటే నాకౌట్‌ దశ మొదలవుతోంది. ఒక్కో మ్యాచ్‌ లక్ష్యంగా నేను ముందుకెళ్తున్నా. ఇక మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మాది చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి’ అని భగత్‌ తెలిపాడు.

భగత్‌, పలక్‌ కోహ్లీ జంట శుక్రవారం మిక్సడ్‌ డబుల్స్‌ పోరులో సిరిపాంగ్‌ టీమరామ్‌, నిపాద సేన్‌సుపతో తలపడనుంది. ఇక పురుషుల సింగిల్స్‌లో సుహాస్‌ యతిరాజ్‌, తరుణ్ ధిల్లాన్‌, కృష్ణ నాగర్‌ విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. మహిళల సింగిల్స్‌లో తొలి రౌండ్లో ఓడిన పలక్‌ రెండో రౌండ్లో విజయం అందుకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని