PM Modi: నీరజ్‌ జావెలిన్‌, సింధు రాకెట్‌, లవ్లీనా గ్లోవ్స్‌.. వేలం వేయనున్న ప్రధాని మోదీ!

ఒలింపిక్స్‌కు ముందు, తర్వాత భారత క్రీడాకారుల్లో ప్రధాని నరేంద్రమోదీ ఉత్సాహం నింపారు. మొదట పతకాలు తీసుకొచ్చేందుకు ప్రోత్సహించారు...

Updated : 21 Aug 2021 16:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒలింపిక్స్‌కు ముందు, తర్వాత భారత క్రీడాకారుల్లో ప్రధాని నరేంద్రమోదీ ఉత్సాహం నింపారు. మొదట పతకాలు తీసుకొచ్చేందుకు ప్రోత్సహించారు. తిరిగొచ్చాక వారి ఆటతీరును ప్రశంసించారు. కాగా ఆయన మరో మంచి పనికి పూనుకున్నారని తెలిసింది. నీరజ్‌ చోప్రా జావెలిన్‌, లవ్లీనా బాక్సింగ్‌ గ్లోవ్స్‌, పీవీ సింధు రాకెటును వేలం వేయనున్నారని సమాచారం.

ఆగస్టు 16న ఒలింపిక్స్‌ క్రీడాకారులకు ప్రధాని మోదీ తన నివాసంలో అల్పాహార విందును ఏర్పాటు చేశారు. ప్రతి క్రీడాంశానికి చెందిన అథ్లెట్లతో ప్రత్యేకంగా ముచ్చటించారు. పతకాలు తెచ్చినవారినే కాకుండా అత్యుత్తమ ఆటతీరు కనబరిచిన వారిని, మెగా క్రీడల్లో ఆడిన అథ్లెట్లను అభినందించారు. ముందుగానే ఇచ్చిన మాట ప్రకారం సింధుకు ఐస్‌క్రీం, నీరజ్‌కు చుర్మా తినిపించారు. అదే సమయంలో వారి వద్ద వేలం ప్రతిపాదన తీసుకొచ్చారని తెలుస్తోంది.

నీరజ్‌ చోప్రా తన జావెలిన్‌ను మోదీకి చూపించాడు. అప్పుడు ‘నువ్వు దీనిపై సంతకం చేశావు. నేను దీన్ని వేలం వేస్తాను. ఇబ్బందేం లేదుగా?’ అని ప్రధాని అతడితో అన్నారు. దాంతో చిరునవ్వుతో నీరజ్‌ తన జావెలిన్‌ను మోదీకి బహూకరించాడు. అంతేకాకుండా పీవీ సింధు తన రాకెట్‌ను ఇచ్చింది. ఇక బాక్సర్ లవ్లీనా నుంచి ప్రధాని బాక్సింగ్‌ గ్లోవ్స్‌ తీసుకున్నారు. ‘నేనిప్పుడు వీటిని ధరిస్తే, మోదీ తమనేమో చేయబోతున్నారని రాజకీయ నాయకులు అంటారు’ అని అప్పుడు మోదీ చమత్కరించడం గమనార్హం. ఇవి మాత్రమే కాకుండా మిగతా క్రీడాకారుల నుంచీ ఆయన సేకరించిన వస్తువులను వేలం వేస్తారని అంటున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు