
Deepak chahar: ద్రవిడ్ సర్ నమ్మకం వల్లే..
గెలుపు ఇన్నింగ్స్ ఆడానన్న దీపక్ చాహర్
కొలంబో: కోచ్ రాహుల్ ద్రవిడ్ తన బ్యాటింగ్‌పై నమ్మకం ఉంచాడని టీమ్‌ఇండియా పేసర్ దీపక్ చాహర్ అంటున్నాడు. ఆయన విశ్వాసమే గెలుపు ఇన్నింగ్స్ ఆడేందుకు ప్రేరణగా నిలిచిందని వెల్లడించాడు. మరోవైపు కుర్రాళ్లంతా అదరగొట్టారని కెప్టెన్ శిఖర్ ధావన్ తెలిపాడు. నెట్స్‌లో దీపక్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడని వివరించాడు. శ్రీలంకపై రెండో వన్డే తర్వాత వీరిద్దరూ మీడియాతో మాట్లాడారు.
లంక నిర్దేశించిన 276 పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా 160కే 6 వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ఎనిమిదో స్థానంలో వచ్చిన దీపక్ చాహర్ (69*; 82 బంతుల్లో 7×4, 1×6), కృనాల్ పాండ్య(35)తో 33 (49 బంతుల్లో), భువనేశ్వర్(19*; 28 బంతుల్లో 2×4)తో 84* (84) పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పాడు. జట్టుకు విజయంతో పాటు సిరీస్‌ను అందించాడు.
కలలుగన్న ఇన్నింగ్స్ ఇది
‘దేశానికి విజయం అందించేందుకు మరో దారి లేదు. అన్ని బంతులు ఆడాలని రాహుల్ సర్ చెప్పారు. ఆయన కోచింగ్‌లో నేను భారత్-ఏ తరఫున కొన్ని ఇన్నింగ్స్‌లు ఆడాను. ఆయనకు నాపై నమ్మకం ఉంది. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు నేను సరిపోతానని అన్నారు. నమ్మకం ఉంచారు. ఇకపై జరిగే మ్యాచుల్లో నా వరకు బ్యాటింగ్ రాదనే అనుకుంటున్నా. లక్ష్యం 50 పరుగుల్లోపు వచ్చినప్పుడు గెలుస్తామనే ధీమా కలిగింది. అంతకు ముందు ఒక్కో బంతిని ఆడుతూ ముందుకు సాగాను. ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాలని నేనెప్పటి నుంచో కలగంటున్నా’ అని దీపక్ చాహర్ అన్నాడు.
కుర్రాళ్లకు పాఠం
జట్టులోని కుర్రాళ్లకు ఈ మ్యాచ్ ఒక పాఠమని కెప్టెన్ శిఖర్ ధావన్ అన్నాడు. లక్ష్యం ఛేదించగలమన్న నమ్మకంతో బరిలోకి దిగామని వెల్లడించాడు. అయితే, శుభారంభం లభించలేదన్నాడు. ఇలాంటి మ్యాచుల వల్ల కుర్రాళ్లకు అనుభవం వస్తుందన్నాడు. ఏ పరిస్థితుల్లో ఎలా ఆడాలో నేర్చుకోవచ్చని వివరించాడు.
‘జట్టులో ప్రతి ఒక్కరు ఆత్మవిశ్వాసం ప్రదర్శించారు. లక్ష్య ఛేదనలో ఒడుదొడుకులు ఎదురయ్యాయి. అయితే, నెట్స్‌లో చాహర్ చక్కగా బ్యాటింగ్ చేయడం మాకు తెలుసు. మ్యాచు పరిస్థితులపై అతడికి చక్కని అవగాహన ఉంది. ఆఖరి నాలుగు ఓవర్లలో వారు లెగ్ స్పిన్నర్ల బౌలింగ్‌లో రిస్క్ తీసుకోలేదు. లంకేయులు చక్కగా ప్రణాళికలు అమలు చేశారు. స్పిన్నర్లను ముందే తీసుకొచ్చి ఒత్తిడి చేశారు. వారు శ్రమించినా మేం గెలిచినందుకు సంతోషంగా ఉంది’ అని గబ్బర్ అన్నాడు.