Updated : 18/09/2021 13:02 IST

Ravi Shastri: టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌గా అనుకున్నవన్నీ సాధించా: రవిశాస్త్రి

49 ఏళ్ల కెరీర్‌లో ఆ విజయాలే గొప్ప సంతృప్తినిచ్చాయి..!

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌గా తాను అనుకున్నదాని కన్నా ఎక్కువే సాధించానని రవిశాస్త్రి సంతోషం వ్యక్తం చేశాడు. రాబోయే టీ20 ప్రపంచకప్ తర్వాత తన కాలపరిమితి ముగుస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ వ్యాఖ్యలు చేశాడు. నాలుగో టెస్టు సందర్భంగా కరోనా బారిన పడిన అతడు ఇటీవలే కోలుకొని భారత్‌కు తిరిగి వచ్చేందుకు ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ అంతర్జాతీయ పత్రికతో మాట్లాడుతూ టీమ్‌ఇండియా కోచ్‌గా తన ప్రయాణం గురించి వివరించాడు. ఈ పొట్టి ప్రపంచకప్‌ సాధిస్తే తనకు ఇంకా ప్రత్యేకంగా ఉంటుందని, అయితే టీమ్‌ఇండియా ఇప్పటికే గొప్ప విజయాలు సాధించిందని హర్షం వ్యక్తంచేశాడు.

‘నేను అనుకున్నవన్నీ సాధించా. నా నేతృత్వంలో టీమ్ఇండియా ఐదేళ్లు టెస్టు క్రికెట్‌లో నంబర్‌వన్‌గా కొనసాగింది. ఆస్ట్రేలియాలో రెండుసార్లు విజయాలు సాధించింది. ఇంగ్లాండ్‌ను కూడా సొంతగడ్డపై ఓడించింది. ఈ విషయాలపై ఇంగ్లాండ్‌ మాజీ ప్లేయర్‌ మైఖేల్‌ అథర్టన్‌తోనూ మాట్లాడాను. కరోనా కాలంలో భారత్‌.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో విజయాలు సాధించింది. మరీ ముఖ్యంగా ఈ పర్యటనలో 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఓవల్‌, లార్డ్స్‌ మైదానాల్లో భారత్‌ విజయాలు సాధించడం నాకెంతో ప్రత్యేకం. అలాగే ప్రతి జట్టునూ వారి సొంతగడ్డపైనే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఓడించింది. ఇక చివరగా ఈ ప్రపంచకప్‌ ఒక్కటి సాధిస్తే నాకు అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

ఇంకా మాట్లాడుతూ.. ఎక్కడైనా ఎక్కువకాలం ఉండకూడదనేది తన అభిమతమని, తన నేతృత్వంలో టీమ్‌ఇండియా గొప్ప విజయాలు సాధించిందని గుర్తుచేశాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లో టెస్టు విజయాలు సాధించడం తన 40 ఏళ్ల క్రికెట్‌ జీవితంలో అత్యంత సంతృప్తికరమైన క్షణాలని వివరించాడు. ఇక రాబోయే టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ విజేతగా నిలవడానికి పూర్తిస్థాయిలో కృషిచేస్తామని చెప్పాడు. తమ శక్తి సామర్థ్యాల మేరకు పోరాడితే కప్పు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఇకపై టెస్టు క్రికెట్‌ గురించి మర్చిపోయి టీ20 మజాను ఆస్వాదించాలన్నాడు. కాగా, జట్టును వీడి బయటకు వెళ్లడం బాధాకరంగా ఉందన్నాడు. అయితే, ఎంతో మంది గొప్ప ఆటగాళ్లతో నాలుగేళ్లు కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని రవిశాస్త్రి పేర్కొన్నాడు. తనకాలంలో టీమ్‌ఇండియా డ్రెస్సింగ్‌రూమ్‌లో మంచి వాతావరణం ఉండేదని, అన్నింటికీ మించి తాము సాధించిన విజయాలే తమను గర్వంగా ఉంచుతాయని చెప్పాడు.

కాగా, రవిశాస్త్రి 2017లో టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌గా ఎంపికయ్యాడు. అంతకుముందు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో విభేదాల కారణంగా కోచ్‌గా ఉన్న అనిల్‌కుంబ్లే ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. అప్పటి నుంచి 2019 వరకు శాస్త్రి తొలిసారి రెండేళ్ల కాలపరిమితికి ఎంపికయ్యాడు. అనంతరం మళ్లీ రెండేళ్లకు తన కాలపరిమితిని పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రాబోయే ప్రపంచకప్‌ తర్వాత తన గడువు ముగియనుంది. దీంతో బీసీసీఐ ఇప్పుడు కొత్త కోచ్‌ ఎంపికకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, మాజీ కోచ్‌ అనిల్‌కుంబ్లేను తిరిగి తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై స్పష్టత రావాలంటే మరిన్ని రోజులు వేచిచూడాలి.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని