IND vs NZ: ఒక్క మ్యాచ్‌తో.. హర్భజన్‌, కుంబ్లే రికార్డులపై కన్నేసిన అశ్విన్‌

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్‌ఇండియా సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ రెండు ప్రధాన రికార్డులపై కన్నేశాడు....

Published : 25 Nov 2021 10:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్‌ఇండియా సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ రెండు ప్రధాన రికార్డులపై కన్నేశాడు. అవి కూడా భారత స్పిన్‌ దిగ్గజాలు హర్భజన్‌, అనిల్‌ కుంబ్లేవి కావడం గమనార్హం. టెస్టుల్లో ప్రస్తుతం 413 వికెట్లతో కొనసాగుతున్న అశ్విన్‌ ఈ మ్యాచ్‌లో మరో ఐదు వికెట్లు పడగొడితే టీమ్‌ఇండియా తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లలో మూడో స్థానానికి చేరనున్నాడు. ఇప్పటి వరకు ఈ స్థానంలో హర్భజన్‌ (417) కొనసాగుతున్నాడు.

అలాగే అశ్విన్‌ ఈ మ్యాచ్‌లో పది వికెట్ల ప్రదర్శన చేస్తే.. టీమ్‌ఇండియా తరఫున అత్యధిక సార్లు ఈ ఘనత సాధించిన అనిల్‌ కుంబ్లే (8)తో సమానంగా నిలుస్తాడు. ప్రస్తుతం అశ్విన్‌ ఏడు సార్లు టెస్టుల్లో పది వికెట్లు తీశాడు. శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ 22 సార్లు ఈ ఘనత సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. కాగా, టీమ్‌ఇండియా ఇప్పటికే టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయగా ఇప్పుడు టెస్టు సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఆడుతోంది. సీనియర్లు విరాట్‌, రోహిత్‌, రాహుల్‌, పంత్‌, బుమ్రా, షమి విశ్రాంతి తీసుకోగా కొత్తగా జట్టులో చేరిన యువకులు బాగా ఆడి ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని