Rohit Sharma: 2019లోనే నాకు చివరి అవకాశమని తెలుసు: రోహిత్

2019లో టెస్టుల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగి సత్తా చాటుకోవడానికి అదే చివరి అవకాశమని తనకు ముందే తెలుసని భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అన్నాడు...

Published : 06 Sep 2021 01:14 IST

ఇంటర్నెట్ డెస్క్‌: 2019లో టెస్టుల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగి సత్తా చాటుకోవడానికి అదే చివరి అవకాశమని తనకు ముందే తెలుసని భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్‌ (127) శతకంతో మెరిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతడు టెస్టుల్లో 3 వేల పరుగులు పూర్తిచేసుకున్నాడు. అలాగే విదేశీ గడ్డపై తొలి టెస్టు శతకం కూడా సాధించాడు. ఈ నేపథ్యంలోనే మూడో రోజు ఆట ముగిసిన అనంతరం హిట్‌మ్యాన్‌ మీడియాతో మాట్లాడాడు.

‘2019లో టెస్టు జట్టులో బ్యాటింగ్‌ స్థానం కోసం ఎదురుచూస్తున్న నాకు ఓపెనర్‌గా అవకాశం వచ్చింది. సత్తా చాటడానికి ఇదే చివరి అవకాశమని అప్పుడే అనుకున్నా. ఈ విషయం తెలియగానే దాని గురించి చాలా విషయాలు తెలుసుకున్నా. ఎందుకంటే ఏదో ఒక సమయంలో నన్ను ఓపెనర్‌గా పంపడానికి జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ సవాల్‌ని స్వీకరించడానికి మానసికంగా ముందే సిద్ధమయ్యా. అంతకుముందు మిడిల్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేశాను. అయితే, అప్పుడు సరిగా ఆడలేకపోయా. దీంతో ఈసారే నాకు చివరి అవకాశమని భావించా. జట్టు యాజమాన్యం ఏ విధంగా ఆలోచిస్తుందో నాకు తెలుసు. మనం ఆడుతున్నది ఏ ఆటైనా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. సవాళ్లను స్వీకరించాలి. వన్డే మ్యాచ్‌లకు, టెస్టు మ్యాచ్‌లకు చాలా వ్యత్యాసం ఉంటుంది. డిఫెన్స్‌ ఆడటం, బంతులను ఆడకుండా వదిలేయడం లాంటివి నెట్స్‌లో తీవ్రంగా సాధన చేశా. ఇప్పుడు సంతోషకరమైన విషయం ఏమిటంటే ఈ ఇన్నింగ్స్‌లో 250కిపైగా బంతులు ఎదుర్కొని క్రీజులో నిలబడ్డా. ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కుకుపోవడమే నా లక్ష్యం. సాధ్యమైనంతవరకు అందుకోసమే ప్రయత్నిస్తా. అలా ఉండటం వల్ల బౌలర్లు ఏ విధమైన బంతులు వేస్తున్నారనేది అర్థమవుతుంది’ అని హిట్‌మ్యాన్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని