IND vs NZ: గెలవడం అంత తేలిక కాదని తెలిసింది: రోహిత్

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో గెలవడం అంత తేలిక కాదని చివర్లో తెలిసొచ్చిందని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. టీ20 సారథిగా నూతన బాధ్యతలు తీసుకున్న అతడు తొలి మ్యాచ్‌లోనే టీమ్‌ఇండియాను గెలిపించాడు...

Updated : 18 Nov 2021 08:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో గెలవడం అంత తేలిక కాదని చివర్లో తెలిసొచ్చిందని టీమ్‌ ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. టీ20 సారథిగా నూతన బాధ్యతలు తీసుకున్న అతడు తొలి మ్యాచ్‌లోనే జట్టును గెలిపించాడు. 165 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్‌ (48; 36 బంతుల్లో 5x4, 2x6), సూర్యకుమార్‌ (62; 40 బంతుల్లో 6x4, 3x6) చెలరేగిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ రెండో వికెట్‌కు 59 పరుగులు జోడించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే, జట్టు స్కోర్‌ 109 వద్ద రోహిత్‌, 144 పరుగుల వద్ద సూర్యకుమార్‌ ఔటవ్వగా చివరి మూడు ఓవర్లలో భారత్‌కు 21 పరుగులు చేయాల్సి వచ్చింది.

అలాంటి కీలక సమయంలో ఫెర్గూసన్‌, సౌథీ కట్టుదిట్టంగా బంతులేసి తర్వాతి రెండు ఓవర్లలో 11 పరుగులే ఇచ్చారు. దీంతో చివరి ఓవర్లో టీమ్‌ఇండియా విజయానికి 10 పరుగులు అవసరమయ్యాయి. చేతిలో వికెట్లున్నా కివీస్‌ కట్టుదిట్టంగా బంతులేస్తుండటంతో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. ఇక మిచెల్‌ చివరి ఓవర్‌ వేయగా తొలి బంతి వైడ్‌గా వెళ్లింది. తర్వాత వెంకటేశ్‌ అయ్యర్‌(4) ఒక బౌండరీ బాది ఔటయ్యాడు. దీంతో మళ్లీ ఉత్కంఠ నెలకొంది. మూడో బంతి కూడా వైడ్‌ రావడంతో తర్వాత అక్షర్‌ పటేల్‌ (1) సింగిల్‌ తీసి పంత్‌కు బ్యాటింగ్‌ అవకాశం కల్పించాడు. నాలుగో బంతికి పంత్‌ (17*) బౌండరీ బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. మ్యాచ్‌ చివరి ఓవర్లో ఉత్కంఠ నేపథ్యంలో రోహిత్‌ స్పందించాడు.

‘చివర్లో విజయం సాధించడం కష్టమనే విషయాన్ని మేం గుర్తించాం. మా కుర్రాళ్లు ఇలా రాణించడం గొప్పగా ఉంది. అయితే, కొత్త కుర్రాళ్లు ఇలాంటి కీలక సమయంలో టీమ్‌ ఇండియా తరఫున రాణించడం ఇదే తొలిసారి. చివరి దశలో జట్టు విజయం సాధించాలంటే ఏం చేయాలనే దాన్ని అర్థం చేసుకోవడం చాలా మంచిది. ఎప్పుడూ దంచికొట్టడమే సరిపోదు. పరిస్థితులకు తగ్గట్టు ఆడుతూ ఫీల్డర్ల మధ్యలోంచి షాట్లు ఆడటం కూడా ముఖ్యమే. కివీస్‌ ఇన్నింగ్స్‌లో ఆఖరి రెండు, మూడు ఓవర్లు మా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడం మంచి పరిణామం. ఇక అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌ దిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో కీలక స్పిన్నర్లు. ఎప్పుడూ వికెట్లు తీయాలనే కసితో ఉంటారు. మరోవైపు సూర్యకుమార్‌ బాగా ఆడాడు. తన సహజసిద్ధమైన ఆట చూపించాడు. చివరగా నేను, బౌల్ట్‌ చాలా మ్యాచ్‌లు కలిసి ఆడాం. తనకు నా బలహీనత తెలుసు. నాకు అతడి బలం తెలుసు. దీంతో మా ఇద్దరి మధ్యా ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం నెలకొంది’ అని రోహిత్‌ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని