Rohit Sharma: ఆ విషయంపై ఇప్పుడే ఆలోచించడం తొందరపాటు: రోహిత్

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లోనూ టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది...

Updated : 20 Nov 2021 10:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లోనూ టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన జట్టు బాగా ఆడిందని, ప్రతి ఒక్కరూ గొప్పగా రాణించారని మెచ్చుకున్నాడు. పరిస్థితులు అనుకూలించకపోయినా తాము ఆడిన తీరు అద్భుతమని తెలిపాడు. న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఎలా ఆడతారనేది తమకు తెలుసని, వాళ్లు తొలుత మంచి షాట్లు ఆడారన్నాడు. ఒక్క వికెట్‌ పడితే చాలని సహచరులతో చెప్పానన్నాడు. వారిని కట్టడి చేయడానికి తమ బౌలర్లు బాగా కృషి చేశారన్నాడు.

‘నైపుణ్యమున్న ఆటగాళ్లతో మా జట్టు బలంగా ఉండటం శుభపరిణామం. అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరూ నిలకడగా రాణిస్తున్నారు. ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛనివ్వడం చాలా ముఖ్యమైన విషయం. ఇక ఇతర విషయాల గురించి వాళ్లే చూసుకుంటారు. ఇదో యువకుల జట్టు. ప్రస్తుతమున్న ఆటగాళ్లు ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. అలాగే తర్వాతి మ్యాచ్‌లో మార్పులు చేర్పులపై ఇప్పుడే ఆలోచించడం తొందరపాటు అవుతుంది. జట్టుకు ఏది అవసరమో అదే చేస్తాం. ఇప్పుడు ఎవరైతే రాణిస్తున్నారో వాళ్లని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మరోవైపు అవకాశాలు రాని వారికి కూడా సమయం, సందర్భాన్ని బట్టి ఆడే వీలు కల్పిస్తాం. ఇక తొలి మ్యాచ్‌ ఆడుతున్న హర్షల్ పటేల్‌ తానేంటో చూపించాడు. అతడు నైపుణ్యమున్న బౌలర్. మంచు ప్రభావమున్న ఇలాంటి పరిస్థితుల్లోనూ నిజంగా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు’ అని రోహిత్‌ చెప్పుకొచ్చాడు.

మేం ఇద్దరం ఆస్వాదిస్తాం: రాహుల్‌

మరోవైపు రోహిత్‌, తానూ.. ఓపెనింగ్‌ చేయడాన్ని ఆస్వాదిస్తామని కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. హిట్‌మ్యాన్‌ బ్యాటింగ్‌ అంటే తనకెంతో ఇష్టమని, అతడిది క్లాస్‌ బ్యాటింగ్‌ అని చెప్పాడు. ఎవరైనా బౌలర్‌ తనని ఇబ్బందులకు గురిచేస్తే.. రోహితే స్వయంగా ఆ బౌలర్‌పై ఎదురు దాడికి దిగుతాడని చెప్పాడు. దీంతో తనపై ఒత్తిడి తగ్గుతుందని తెలిపాడు. తమ ఇద్దరి మధ్య మంచి సమన్వయం ఉందని, టాప్‌ ఆర్డర్‌లో ఎలా పరుగులు చేయాలో తమకు తెలుసని వివరించాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియాకు శుభారంభం చేసి మంచి స్కోర్లు అందించాలనుకుంటున్నట్లు రాహుల్‌ చెప్పాడు.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని