SuryaKumar Yadav: అప్పుడు కోహ్లీ అలా చేయడం వల్లే.. ఇప్పుడు ఇలా: సూర్యకుమార్‌

భారత క్రికెటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మాంచి జోష్‌లో ఉన్నాడు. బుధవారం న్యూజిలాండ్‌తో..

Updated : 18 Nov 2021 17:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్: భారత క్రికెటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మాంచి జోష్‌లో ఉన్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అర్ధశతకం (62) సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతోపాటు మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డును అందుకున్నాడు. ఈ క్రమంలో తన బ్యాటింగ్‌ ఆర్డర్‌పై సూర్యకుమార్‌ సంతోషం వ్యక్తం చేశాడు. అయితే దీనింతటికి కారణం టీ20 జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లీ అని తెలిపాడు. ‘‘బ్యాటింగ్‌ ఆర్డర్‌కు సంబంధించి నేను ఎప్పుడూ ఫ్లెక్సిబుల్‌గా ఉంటా. ఓపెనింగ్‌ నుంచి ఏడో స్థానంలోనూ బ్యాటింగ్‌ చేయగలను. ఎలాంటి స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉంటా’’ అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పాడు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ సందర్భంగా మూడో టీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో తనను బ్యాటింగ్‌కు పంపించడం వల్లే రాణించగలుగుతున్నానని సూర్యకుమార్‌ వివరించాడు. ఇప్పుడు కివీస్‌తో మ్యాచ్‌ సందర్భంగా కోహ్లీ గైర్హాజరీలో సూర్యకుమార్‌ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ‘‘ నాకు ఇప్పటికీ గుర్తే. విరాట్ కోహ్లీ త్యాగం వల్లే నా బ్యాటింగ్ అరంగేట్రం అయింది. విరాట్ నాలుగో స్థానంలో వచ్చి నన్ను మూడో పొజిషన్‌లో బ్యాటింగ్‌కు పంపాడు. టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా నమీబియాతో మ్యాచ్‌లోనూ వన్‌డౌన్‌లోనే వెళ్లాను. ఆ మ్యాచ్‌లో నాటౌట్‌గా లక్ష్యాన్ని పూర్తి చేయడం ఎంతో బాగుంది’’ అని సూర్యకుమార్‌ పేర్కొన్నాడు. 

ఈ ఏడాది మార్చిలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ అరంగేట్రం చేశాడు. అయితే ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు.  మూడో మ్యాచ్‌లో సూర్యకుమార్‌కు స్థానం దక్కలేదు. కీలకమైన నాలుగో టీ20 మ్యాచ్‌లో బ్యాటింగ్ అరంగేట్రం చేసిన సూర్యకుమార్‌ తన సత్తా ఏంటో చూపించాడు. వన్‌డౌన్‌లో దిగిన సూర్యకుమార్‌ కేవలం 31 బంతుల్లోనే 57 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. తర్వాతి మ్యాచ్‌లోనూ (ఐదో టీ20) దూకుడుగా 32 పరుగులు చేసి టీమ్‌ఇండియా భారీ స్కోరు సాధించడంలో దోహదపడ్డాడు. అయితే టీ20 ప్రపంచకప్‌లో ఆశించినంత స్థాయిలో రాణించలేకపోయాడు. నాలుగు మ్యాచులు మూడు ఇన్నింగ్స్‌ల్లో 43 పరుగులే చేశాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయంగా తొమ్మిది టీ20లు (ఏడు ఇన్నింగ్స్‌లు) ఆడిన సూర్యకుమార్‌ 160.93 స్ట్రైక్‌రేట్‌తో 243 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్ధశతకాలు ఉన్నాయి. సూర్యకుమార్‌ అత్యధిక స్కోరు కివీస్‌పైనే (62) కావడం విశేషం.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని