India vs Srilanka: 360 డిగ్రీల్లో సూర్య బ్యాటింగ్‌... తనపై ఒత్తిడి తొలగించాడన్న గబ్బర్‌

యువ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ 360 డిగ్రీల్లో చేసే బ్యాటింగ్‌ చూడముచ్చటగా ఉందని టీమ్‌ఇండియా సారథి శిఖర్‌ ధావన్‌ అంటున్నాడు. శ్రీలంకతో తొలి టీ20లో తనపై ఒత్తిడిని అతడు తొలగించాడని ప్రశంసించాడు....

Updated : 26 Jul 2021 14:28 IST

కొలంబో: యువ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ 360 డిగ్రీల్లో చేసే బ్యాటింగ్‌ చూడముచ్చటగా ఉందని టీమ్‌ఇండియా సారథి శిఖర్‌ ధావన్‌ అంటున్నాడు. శ్రీలంకతో తొలి టీ20లో తనపై ఒత్తిడిని అతడు తొలగించాడని ప్రశంసించాడు. విజయంలో అతడు కీలక పాత్ర పోషించాడని వెల్లడించాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత గబ్బర్‌ మీడియాతో మాట్లాడాడు.

లంకతో జరిగిన తొలి టీ20లో సూర్యకుమార్‌ (50; 34 బంతుల్లో 5×4, 2×6) అర్ధశతకం సాధించాడు. లంకేయుల కట్టుదిట్టంగా బంతులు వేసినా అతడు నిర్భయంగా ఆడాడు. సొగసైన బౌండరీలతో చెలరేగాడు. అతడు 50 పరుగులు చేయడంతోనే టీమ్‌ఇండియా స్కోరు 150 దాటింది. ఆడిన నాలుగు టీ20ల్లోనే సూర్య రెండు అర్ధసెంచరీలు చేయడం గమనార్హం. ఆ తర్వాత భువనేశ్వర్‌ కుమార్‌ 4 వికెట్లతో చెలరేగడంతో భారత్‌ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు ఛేదించలేకపోయింది.

‘సూర్య గొప్ప ఆటగాడు. అతడి బ్యాటింగ్‌ను మేం ఆస్వాదించాం. నాపై ఒత్తిడిని మాయం చేశాడు. సమయోచితంగా షాట్లు ఆడాడు. ఆదిలోనే వికెట్లు కోల్పోయినా మేం బాగానే ఆడాం. రెండు మూడు బౌండరీలు కొడితే పట్టు సాధిస్తామని అనుకున్నాం. నిజానికి మేం 16-20 పరుగులు తక్కువ చేశాం. స్పిన్నర్లు కీలకమవుతారని భావించా. అనుకున్నట్టే వారు బాగా బౌలింగ్‌ చేశారు. ఇక భువీ అద్భుతం. కృనాల్‌ పాండ్య సైతం రాణించాడు. తొలి మ్యాచే అయినా వరుణ్‌ పరుగులను నియంత్రించాడు. అతడిని ఆడటం కష్టం. అతడిని చూస్తే సంతోషంగా ఉంది’ అని ధావన్‌ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని