T20 World Cup: టీమ్‌ఇండియా జట్టులో ధోనీ మరో కొత్త పాత్ర!

టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌ జట్టులో మెంటార్‌గా కొత్త బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే...

Updated : 23 Oct 2021 12:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌ జట్టులో మెంటార్‌గా కొత్త బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌లో ఈ మాజీ సారథి.. కోహ్లీసేనకు ఉపయోగపడతాడని భావించి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, సెక్రటరీ జైషా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌తో తొలిపోరుకు ముందు ధోనీ ప్రాక్టీస్‌ సెషన్‌లో టీమ్‌ఇండియా ఆటగాళ్లతో కలిసి పనిచేస్తున్నాడు. అయితే, తాజాగా త్రోడౌన్‌ స్పెషలిస్టుగానూ బౌలింగ్‌ చేస్తూ కనిపించాడు. అందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ అభిమానులతో పంచుకొంది. ‘టీమ్‌ఇండియా నూతన ‘త్రోడౌన్‌ స్పెషలిస్టు మహేంద్రసింగ్‌ ధోనీని పరిచయం చేస్తున్నాం’ అంటూ ట్విటర్‌లో పోస్టు చేసింది.

మహీ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకొన్నా కెప్టెన్‌గా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 14వ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను మరోసారి విజేతగా నిలబెట్టి తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. దీంతో ప్రపంచకప్‌లో మెంటార్‌గా అతడి సేవలు టీమ్‌ఇండియాకు ఎంతో ఉపయోగకరం అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు ధోనీని ఇలా మార్గనిర్దేశకుడిగా ఎంపిక చేయడం.. రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదని, దీని వెనుక బలమైన చర్చే జరిగిందని గంగూలీ చెప్పాడు. ధోనీని ఎలాగైనా టీమ్‌ఇండియాతో కలిసి పనిచేసేలా చేయాలని జైషాతో చాలా కాలం చర్చలు జరిపినట్లు ఇటీవల వివరించాడు. అతడు ఇప్పటికే రెండు ప్రపంచకప్‌లు అందించాడని, కోహ్లీసేనతో కలిపితే జట్టుకు మరింత ప్రయోజనకరం అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని