T20 World Cup: యువరాజ్‌ నుంచి బ్రాత్‌వైట్‌ దాకా..!

ప్రతి ప్రపంచకప్‌లో ఒక ఆటగాడు ఉంటాడు. అన్ని మ్యాచ్‌ల్లో రాణించకపోయినా కీలక సమయాల్లో మెరుస్తాడు. బ్యాటింగ్‌లోనో, బౌలింగ్‌లోనో సంచలన ప్రదర్శన చేసి తమ జట్టుకు అపురూప విజయం...

Updated : 21 Oct 2021 12:20 IST

టీ20 ప్రపంచకప్‌లో సంచలన ఇన్నింగ్స్‌ గుర్తున్నాయా?

ప్రతి ప్రపంచకప్‌లో ఒక ఆటగాడు ఉంటాడు.. అన్ని మ్యాచ్‌ల్లో రాణించకపోయినా కీలక సమయాల్లో మెరుస్తాడు. బ్యాటింగ్‌లోనో, బౌలింగ్‌లోనో సంచలన ప్రదర్శన చేసి తమ జట్టుకు అపురూప విజయం అందించడమే కాకుండా అభిమానుల గుండెల్లో చిరకాలం నిలిచిపోతాడు. అలా 2007 నుంచి 2016 వరకు ఒక్కో టీ20 ప్రపంచకప్‌లో ఒక్కో ఆటగాడు తమలోని అత్యుత్తమ నైపుణ్యాలతో అభిమానులను అలరించారు. మరి ఏయే టోర్నీలో ఏయే ఆటగాడు ఎప్పుడు ఎలా రాణించాడనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

యువీతోనే మొదలు..

2007 తొలి టీ20 ప్రపంచకప్‌లో ఏమాత్రం అంచనాలు లేని భారత జట్టు ధోనీ సారథ్యంలో విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, ఇక్కడ చెప్పుకోవాల్సింది ముఖ్యంగా యువరాజ్‌ సింగ్‌ గురించి. లీగ్‌ దశలో కీలకమైన ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు చెలరేగి స్టువర్ట్‌బ్రాడ్‌ బౌలింగ్‌లో సంచలనం సృష్టించాడు. ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు బాది ఆ ప్రపంచకప్‌ టోర్నీకే హైలైట్‌గా నిలిచాడు. దీనిని భారత అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ మ్యాచ్‌లో యువీ (58; 16 బంతుల్లో 3x4, 7x6) దంచికొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం టీమ్‌ఇండియా ఫైనల్స్‌లో పాకిస్థాన్‌ను ఓడించి ప్రపంచకప్‌ను ముద్దాడింది.

దిల్షాన్‌ ఒంటరిపోరాటం..

2009లో శ్రీలంక ఆటగాడు తిలకరత్నె దిల్షాన్‌ (96 నాటౌట్‌; 57 బంతుల్లో 12x4, 2x6) మెరిసిపోయాడు. అప్పటివరకు పెద్దగా ఆకట్టుకోలేని అతడు వెస్టిండీస్‌తో జరిగిన సెమీఫైనల్స్‌లో శతకం బాదినంత పనిచేశాడు. ఓపెనర్‌గా వచ్చి చివరి బంతి వరకూ క్రీజులో పాతుకుపోయాడు. ఈ క్రమంలోనే ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ఒంటరిపోరాటం చేశాడు. ఓపెనర్‌ సనత్‌ జయసూర్య(24)తో తొలి వికెట్‌కు 73 పరుగులు జోడించి శుభారంభం అందించాడు. జయసూర్య ఔటయ్యాక సంగక్కర (0), జయవర్దెనె (2), చమర సిల్వ (11), జెహాన్‌ ముబారక్‌ (7) విఫలమయ్యారు. చివర్లో మెండిస్‌ (12; 4 బంతుల్లో 1x4, 1x6)తో ధాటిగా ఆడి 158/5 స్కోర్‌ను అందించాడు. ఆపై విండీస్‌ 17.4 ఓవర్లలో 101 పరుగులకే పరిమితమైంది.

హస్సీ నుంచి ఊహించలేదు..

మరుసటి ఏడాది 2010 టోర్నీలో అత్యంత ప్రభావవంతమైన ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ మైక్‌ హస్సీదే అని చెప్పుకోవాలి. పాకిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్స్‌లో 192 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఎవరూ ఊహించని ఇన్నింగ్స్‌ను హస్సీ (60 నాటౌట్‌; 24 బంతుల్లో 3x4, 6x6) ఆడాడు. జట్టు స్కోర్‌ 105/5 వద్ద ఆస్ట్రేలియా విజయానికి 45 బంతుల్లో 87 పరుగులు చేయాల్సిన స్థితిలో బరిలోకి దిగాడు. కంగారూల ఓటమి ఖాయమనుకున్న దశలో ప్రత్యర్థి బౌలర్లపై సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కామెరూన్‌ వైట్‌ (43), స్టీవ్‌ స్మిత్‌(5), మిచెల్‌ జాన్సన్‌ (5)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

అజంత మెండిస్‌ ఆరు వికెట్లు..

2012 టోర్నీలో శ్రీలంక స్పిన్నర్‌ అజింత మెండిస్‌ సంచలనం సృష్టించాడు. గ్రూప్‌-సీలో జింబాబ్వేతో జరిగిన మొదటి మ్యాచ్‌లోనే తన బౌలింగ్‌ మాయాజాలంతో ఆకట్టుకున్నాడు. తొలుత శ్రీలంక 182/4 భారీ స్కోర్‌ సాధించగా అనంతరం జింబాబ్వే 17.3 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలింది. మెండిస్‌ నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసి రెండు మెయిడిన్లతో పాటు 8 పరుగులే ఇచ్చి 6 వికెట్లు కూల్చాడు. అంతకుముందు 2010 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ పేసర్‌ ఉమర్‌గుల్‌ 3 ఓవర్లు బౌలింగ్‌ చేసి 6 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీయడం గమనార్హం.

ఛేదనలో కింగ్‌ కోహ్లీనే..

ఇక 2014 ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఓటమిపాలైనా.. అంతకుముందు దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీస్‌ పోరులో విరాట్‌ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. 173 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కోహ్లీ (72 నాటౌట్‌; 44 బంతుల్లో 5x4, 2x6) చెలరేగిపోయాడు. నాలుగో ఓవర్‌లోనే రోహిత్‌ (24) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన అతడు.. రహానె(32), యువరాజ్‌ (18), సురేశ్‌ రైనా (21)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఒకవైపు వికెట్లు పడిపోతున్నా.. మరోవైపు క్రీజులో పాతుకుపోయి డేల్‌స్టెయిన్‌ బౌలింగ్‌ త్రయాన్ని దీటుగా ఎదుర్కొన్నాడు. ఇది కోహ్లీ కెరీర్‌లోనే ది బెస్ట్‌ ఇన్నింగ్స్‌ల్లో ఒకటిగా నిలిచింది.

బ్రాత్‌వైట్ పెను విధ్వంసం..

2016 టోర్నీలో ఇంగ్లాండ్‌పై క్రిస్‌గేల్‌ (100*) సెంచరీ, విరాట్‌ కోహ్లీ ఆస్ట్రేలియాపై (82), వెస్టిండీస్‌పై (89*) సంచలన ఇన్నింగ్స్‌లు పక్కనపెడితే ఫైనల్స్‌లో వెస్టిండీస్‌ బ్యాట్స్‌మన్‌ కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ (34; 10 బంతుల్లో 1x4, 4x6) సృష్టించిన పెను విధ్వంసం అందరికీ బాగా గుర్తుండిపోయింది. ఇంగ్లాండ్‌ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు విండీస్‌ బరిలోకి దిగడంతో ఇంగ్లిష్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. ఈ క్రమంలోనే కరీబియన్‌ జట్టు 19 ఓవర్లకు 137/6తో నిలిచింది. చివరి ఓవర్‌లో విజయానికి 19 పరుగులు అవసరం అయ్యాయి. అప్పటికి మార్లోన్‌ సామ్యూల్స్‌ (85; 66 బంతుల్లో 9x4, 2x6), కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ (10) పరుగులతో క్రీజులో ఉన్నా పెద్దగా ఆశలు లేవు. అయితే, బెన్‌స్టోక్స్‌ వేసిన చివరి ఓవర్‌లో వరుసగా నాలుగు సిక్సులు బాది బ్రాత్‌వైట్‌ విండీస్‌ను రెండోసారి విశ్వవిజేతగా నిలిపాడు.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని