T20 World Cup: అఫ్గాన్‌ అభిమానులారా.. మరోసారి ఇలా చేయకండి : అఫ్గాన్‌ కెప్టెన్‌

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌-పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్ల మధ్య శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌కు వేలాది మంది అభిమానులు టికెట్లు లేకుండా తరలిరావడంపై ఐసీసీ విచారణకు ఆదేశించింది...

Updated : 30 Oct 2021 14:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌-పాకిస్థాన్‌ మధ్య శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో వేలాది మంది అఫ్గాన్‌ అభిమానులు టికెట్లు లేకుండా స్టేడియానికి తరలిరావడంపై ఆ జట్టు కెప్టెన్‌ మహ్మద్‌ నబి అసహనం వ్యక్తం చేశాడు. అభిమానులు మరోసారి ఇలా చేయొద్దని కోరాడు. మరోవైపు ఈ విషయంపై ఐసీసీ విచారణకు ఆదేశించింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డును (ఈసీబీ) కోరింది. దుబాయ్‌ వేదికగా గతరాత్రి జరిగిన మ్యాచ్‌ను చూసేందుకు అఫ్గాన్‌కు చెందిన వేలాది మంది అభిమానులు టికెట్లు లేకుండా స్టేడియం వద్దకు తరలివచ్చారు. వారంతా బలవంతంగా లోపలికి ప్రవేశించేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన దుబాయ్‌ పోలీసులు బలగాల్ని మోహరించి అక్కడున్న వారిని చెదరగొట్టారు. స్టేడియంలో ఉన్న ఆటగాళ్లు, ఇతరుల భద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో స్టేడియంలోని అన్ని గేట్లు మూసేసి ఎవరినీ అనుమతించలేదు.

అయితే, కొందరు అభిమానులు టికెట్లు కొనుగోలు చేసినా మైదానంలోనికి అనుమతించలేదు. ఈ విషయం ఐసీసీ దృష్టికి చేరడంతో సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని ఈసీబీని ఆదేశించింది. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని స్పష్టం చేసింది. మరోవైపు ఈ మ్యాచ్‌ కోసం 16 వేలకు పైగా టికెట్లు కేటాయించామని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక టికెట్లు కొనుగోలు చేసినా మ్యాచ్‌కు అనుమతించని వారికి ఐసీసీ, ఈసీబీతో సహా బీసీసీఐ బోర్డులు క్షమాపణలు చెప్పాయి. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన అఫ్గానిస్థాన్‌ కెప్టెన్‌ మహ్మద్‌ నబీ తమ అభిమానులు ఎవరైనా టికెట్లు కొనుగోలు చేసి మాత్రమే స్టేడియానికి రావాలని కోరాడు. ఇలా చేయడం బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ 147/6 స్కోర్‌ చేయగా.. పాకిస్థాన్ 19 ఓవర్లలో ఆ లక్ష్యాన్ని ఛేదించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని