Rahul Dravid: రాహుల్ ద్రవిడ్‌తో ఆడుతూ స్కాట్లాండ్‌ కెప్టెన్‌ రనౌట్‌

టీమ్‌ఇండియా నూతన కోచ్‌, మాజీ సారథి రాహుల్‌ ద్రవిడ్‌ 2003లో స్కాట్లాండ్‌ తరఫున ఆడిన సందర్భాన్ని ఆ జట్టు కెప్టెన్‌ కైల్‌ కోజర్‌ గుర్తుచేసుకున్నాడు. అప్పుడు ద్రవిడ్‌తో ఆడుతూ తాను రనౌటైనట్లు పేర్కొన్నాడు...

Published : 07 Nov 2021 19:41 IST

2003 నాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న కైల్‌ కోజర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా నూతన కోచ్‌, మాజీ సారథి రాహుల్‌ ద్రవిడ్‌ 2003లో స్కాట్లాండ్‌ తరఫున ఆడిన సందర్భాన్ని ఆ జట్టు కెప్టెన్‌ కైల్‌ కోజర్‌ గుర్తుచేసుకున్నాడు. అప్పుడు ద్రవిడ్‌తో ఆడుతూ తాను రనౌటైనట్లు పేర్కొన్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించడం గమనార్హం. తాజాగా టీమ్‌ఇండియా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్‌ రేసులో ఇంకా ఆశతో ఎదురుచూస్తుంది. ఈ సందర్భంగా కైల్‌ మాట్లాడుతూ  ద్రవిడ్‌తో 18 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనను నెమరువేసుకున్నాడు.

‘అప్పుడు మా దేశవాళీ క్రికెట్‌లో ద్రవిడ్‌ పలు మ్యాచ్‌లు ఆడాడు. ఆ సమయంలో నార్తంప్టన్‌ జట్టుతో తలపడిన మ్యాచ్‌లో మేమిద్దరం కలిసి బ్యాటింగ్‌ చేశాం. అప్పుడు నేను రనౌటయ్యాను. ద్రవిడ్‌ బాగా ఆడాడు. శతకం బాది మా జట్టులో కీలక పాత్ర పోషించాడు. అందువల్ల ఆరోజు నాకు బాగా గుర్తుంది. అయితే, రనౌటయ్యేటప్పుడు ద్రవిడ్‌ చాలా స్పష్టంగా పరుగు కోసం రావొద్దని చెప్పాడు’ అని అప్పుడు 19 ఏళ్ల వయసున్న కైల్‌ తన అనుభవాలను పంచుకున్నాడు. కాగా, ఆ సమయంలో మిస్టర్‌ కూల్ మొత్తం 11 మ్యాచ్‌లు ఆడి 600 పరుగులు చేశాడు. అందులో మూడు శతకాలు, రెండు అర్ధశతకాలు నమోదు చేశాడు. స్ట్రైక్‌రేట్‌ 92.73తో మెరిశాడు. అదే సీజన్‌లో భారత జట్టు తరఫున సైతం ద్రవిడ్‌ రెచ్చిపోయి ఆడాడు. మరోవైపు ద్రవిడ్‌ ఇటీవలే టీమ్‌ఇండియా నూతన కోచ్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. అతడి నేతృత్వంలో టీమ్‌ఇండియా ఎలా రాణిస్తుందో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని