
T20 World Cup: టీమ్‌ఇండియాతో ఓటమి మాపై ప్రభావం చూపదు: రషీద్‌ఖాన్
ఇంటర్నెట్‌డెస్క్: టీమ్‌ఇండియాతో ఓటమిపాలవ్వడం అనేది మున్ముందు ఆడే మ్యాచ్‌ల్లో తమపై ఏమాత్రం ప్రభావం చూపదని అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్‌ఖాన్ అన్నాడు. టీమ్‌ఇండియా బలమైన జట్టని, అయితే.. తాము ఏ మ్యాచ్ అయినా ఒకేలా సన్నద్ధమవుతామని చెప్పాడు. ప్రతి గేమ్‌లోనూ తాము ఒకే ఆలోచనా విధానంతో బరిలోకి దిగుతామని తెలిపాడు. తాజాగా కోహ్లీసేనతో తలపడిన మ్యాచ్‌లో అఫ్గాన్ 66 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రషీద్ తన బౌలింగ్‌తో ఆకట్టుకోలేకపోయాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 36 పరుగులు ఇచ్చాడు.
ఇక న్యూజిలాండ్‌తో ఆడే కీలకపోరు తమకు క్వార్టర్ ఫైనల్ లాంటిదని, ఒకవేళ తాము గెలిస్తే అన్ని జట్ల కన్నా మెరుగైన రన్‌రేట్‌తో తామే సెమీస్‌కు అర్హత సాధిస్తామని రషీద్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆటను ఆస్వాదించాలని, తమ నైపుణ్యాలపై దృష్టిసారించి విజయం సాధించాలని ఉందన్నాడు. ఈ క్రమంలోనే క్రికెట్‌ను ఆస్వాదించినంత కాలం గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నాడు. కాగా, ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌లో నిజంగానే అఫ్గాన్ గెలిస్తే టీమ్‌ఇండియా సైతం సెమీస్‌కు చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే, మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో కోహ్లీసేన నమీబియా, స్కాట్లాండ్ జట్లపై గెలవాల్సి ఉంటుంది. అప్పుడు నెట్‌రన్‌రేట్ పరంగా ఎవరు మెరుగ్గా ఉంటే.. వారే సెమీస్‌కు వెళ్లే వీలుంటుంది. దీంతో అఫ్గాన్, న్యూజిలాండ్ మ్యాచ్ కీలకం కానుంది.