T20 World Cup: అదే జరిగితే.. బ్యాగ్‌ సర్దుకొని ఇంటికి తిరిగొస్తాం: జడేజా

టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 3/15 మేటి ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. టీ20 క్రికెట్‌లో అతడికిదే అత్యుత్తమ ప్రదర్శన...

Updated : 06 Nov 2021 12:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మేటి ప్రదర్శన(3/15) చేసిన సంగతి తెలిసిందే. టీ20 క్రికెట్‌లో అతడికిదే అత్యుత్తమ ప్రదర్శన. మరోవైపు షమి 3/15, బుమ్రా 2/10 సైతం రాణించారు. దీంతో స్కాట్లాండ్‌ 85 పరుగులకే కుప్పకూలగా టీమ్‌ఇండియా 6.3 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ క్రమంలోనే గ్రూప్‌-2లో అఫ్గానిస్థాన్‌ (1.481), న్యూజిలాండ్‌ (1.277) కన్నా మెరుగైన రన్‌రేట్‌ (1.619) సాధించింది. సెమీస్‌ పోరులో నిలవాలంటే భారత జట్టుకు ఈ రన్‌రేట్‌ చాలా కీలకం. అలాగే ఆదివారం అఫ్గానిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఓడిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ విలియమ్సన్‌ జట్టే గెలుపొందితే ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా భారత్‌ ఇంటిముఖం పడుతుంది.

అయితే, మ్యాచ్‌ అనంతరం మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో జడేజా స్పందించాడు. ‘అఫ్గానిస్థాన్‌.. న్యూజిలాండ్‌ను ఓడిస్తేనే మనకు అవకాశం ఉంది. ఒకవేళ న్యూజిలాండే విజయం సాధిస్తే అప్పుడేం చేస్తారు?’ అని రిపోర్టర్‌ ప్రశ్నించాడు. ‘అలా జరిగితే ఏం చేస్తాం..? బ్యాగ్‌ సర్దుకొని ఇంటికి తిరిగొస్తాం’ అని వెంటనే జడేజా బదులిచ్చాడు. దీనికి అక్కడున్న వారంత సరదాగా నవ్వుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే, జడ్డూ వ్యాఖ్యలపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు అతడి కామెడీకి నవ్వుకుంటుండగా మరికొందరు తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైనందుకు ట్రోలింగ్‌ చేస్తున్నారు. అప్పుడే విజయం సాధించి ఉంటే ఇప్పుడు అఫ్గాన్‌ మ్యాచ్‌పై ఆధారపడాల్సి వచ్చేది కాదని అంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని